భీమవరం పుంజుకు పొగరెక్కువ 

24 Dec, 2019 08:55 IST|Sakshi
సేతువా, కొక్కిరాయి

ఒక్కటి రూ.50 వేల వరకు ధర  

సంక్రాంతి పందాలకు కోళ్లు సిద్ధం 

సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్‌): సంక్రాంతి బరిలో ఢీ అంటే ఢీ అనేందుకు కోడిపుంజులు రెడీ అవుతున్నాయి.. రోజూ కఠోర శిక్షణ.. బలవర్ధక ఆహారం.. క్రమతప్పని వ్యాయామంతో కోళ్లను పెంపకందారులు సిద్ధం చేస్తున్నారు.. ముఖ్యంగా భీమవరం పుంజులకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద పండుగకు మరో 20 రోజులే సమయం ఉండటంతో భీమవరం ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పుంజులను పెంపకందారులు సాకుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి ప్రముఖులు వచ్చి ఇక్కడ పుంజులను కొనుగోలు చేస్తుంటారు.  

ఢీ అంటే ఢీ  
సంక్రాంతి కోడి పందాలకు భీమవరం ప్రాంతం పుంజులు అంటే యమ క్రేజ్‌ ఉంటుంది. ఈ ప్రాంతంలో కొందరు పుంజులను కేవలం సంక్రాంతి పండుగ పందాలకు మాత్రమే పెంచుతారు. చంటి పిల్లల్లా వాటిని చూసుకుంటూ ఆహారం, వ్యాయామంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పుంజుల శిబిరాల వద్ద జీతగాళ్లను పెట్టి మరీ వాటిని పెంచుతున్నారు పెంపకందారులు. ఈ ప్రాంతంలో కోడి  పుంజులు పెంచడం  ఒక రాయల్టీగా ఫీలవుతారు.

పర్ల జాతి పుంజు,  డేగ పుంజు

ఆహారం ఇలా.. 
పందెం పుంజులకు అందించే ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. మటన్‌ కైమా, బాదం, జీడిపప్పు, కోడిగుడ్డు, చోళ్లు, గంట్లు, వడ్డు మిశ్రమంగా కలిపి క్రమం తప్పకుండా ఆహారంగా అందిస్తున్నారు. ప్రతిరోజూ మటన్‌ ఖైమా తప్పనిసరి. ఉదయం బాదం, మటన్‌ కైమా, సాయంత్రం గంట్లు, చోళ్లు పెడతారు. ఉదయం పుంజులతో ఈత కొట్టిస్తారు. కత్తులు లేకుండా డిక్కీ పందాలు మాదారి పుంజులు తలపడేలా చూస్తుంటారు. దీని ద్వారా పుంజు సామర్థ్యాన్ని పెంపకందారులు అంచనా వేస్తారు. ప్రత్యేక ఆవాసాలలో(గూళ్లు) వీటిని ఉంచుతారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణ కలి్పంచేలా ఏర్పాట్లు చేస్తారు.   

3 నెలలు.. రూ.15 వేలు ఖర్చు  
కోడిపుంజు పందానికి సిద్ధం చేయడానికి మూడు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో వీటికి అందించే ఆహారం, భద్రత తదితరాల కింద పెంపకందారులు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తారు. ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా మంచి సామర్థ్యం ఉన్న పుంజులను సిద్ధం చేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తుంటారు. 

భీమవరం ప్రాంతంలో కోడి పుంజుల పెంపక కేంద్రం, బలవర్ధక ఆహారం ఇదే.. 

భీమవరం పుంజుకు పొగరెక్కువ 
భీమవరం పుంజుకు పొగరే కాదు ధర కూడా ఎక్కువే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ఇక్కడకు వచ్చి పుంజులు కొనుగోలు చేస్తుంటారు. రకాన్ని బట్టి కోడి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. పందెంరాయుళ్లు ముందుగా వచ్చి వారికి కావాల్సిన రకం బట్టి కొంత అడ్వాన్సు ఇచ్చి మరీ వెళుతుంటారు. దీంతో సంక్రాంతి సీజన్‌కు ముందు పెంపకందారులకు పుంజులు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.  

రకాలు 
పచ్చకాకి, నల్ల నెమలి, పింగలి, సేతువా, కక్కరాయి (ఎరుపు, నలుపు రకాలు), అబ్రాస్‌ (తెలుపు, ఎరుపు రకాలు), మైల (ఎరుపు, నలుపు రకాలు, డేగ, పండు డేగ, నల్ల బొట్టుల తేతువా,  గేరువా, రసంగి(ఎరుపు, తెలుపు రకాలు), పెట్టమర్రు, కాకి డేగ పర్ల, పర్ల రకాలు ఎక్కువుగా పందాలకు వినియోగిస్తుంటారు. 

మరిన్ని వార్తలు