అట్టహాసంగా ప్రారంభమైన బండలాగుడు పోటీలు

16 Jan, 2016 17:48 IST|Sakshi
అట్టహాసంగా ప్రారంభమైన బండలాగుడు పోటీలు

పగిడ్యాల (కర్నూలు జిల్లా) : సంక్రాంతి తిరుణాళ్లను పురస్కరించుకుని పడమర ప్రాతకోటలోని శ్రీ కాశీవిశ్వేశ్వర, నందీశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో శనివారం పాలపళ్ళ సైజు వృషభరాజముల బండలాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను మాల మహానాడు తాలుకా అధ్యక్షుడు, పవన్ సీడ్స్ అధినేత అచ్చన్న, ప్రతిభ బయోటెక్ సెల్స్ ఆఫీసర్ బాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బండలాగుడు పోటీలను నిర్వహించడం వలన రైతుల్లో నూతనోత్తేజం వస్తుందన్నారు. హలం పట్టి దుక్కి దున్ని తన చెమటను రక్తంగా మార్చి ఆహార ఉత్పత్తులను పండిస్తున్నా గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలం కావడం వలన రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే సంక్రాంతి పండుగను పురష్కరించుకుని నిర్వహించే శ్రీ కాశీవిశ్వేశ్వర, నందీశ్వరస్వామి తిరుణాళ్లలో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేయాలని కోరిన గ్రామ కమిటీ విజ్ఞప్తి మేరకు తమ వంతు సాయంగా రూ. 2 వేలు, రూ. 10 వేలు అందజేశామని వెల్లడించారు. ఇంకా మొదటి బహుమతికి గ్రామకమిటీ రూ. 25 వేలు ఇవ్వగా మిగిలిన నాల్గవ, ఐదవ బహుమతుల కింద ఇచ్చే నగదు పారితోషికాన్ని మాజీ సర్పంచ్ గట్టన్న, అంబటి శివశంకరరెడ్డిలు ఇచ్చారని వివరించారు. ఇలా చేయి చేయి కలిపి నిర్వహించే తిరుణాల వేడుకలలో పోటీలను ప్రారంభించేందుకు అవకాశం లభించడం హర్షనీయమన్నారు. బండలాగుడు పోటీలలో పాల్గొన్న 15 జతల వృషభాల యజమానులు తమ గెలుపు కోసం శ్రమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ శేషు, ఎం.వి.శేషయ్య, యర్రం వెంకటరెడ్డి, అంబటి శివశంకరరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గుర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు