అంతటా సమ్‌క్రాంతే...!

11 Jan, 2014 02:46 IST|Sakshi

కోటవురట్ల: సంక్రాంతి వస్తే....హరిదాసుల గజ్జెల సవ్వడి, గంగిరెద్దుల ఊరేగింపుతో డమరకనాదం, పిండి వంటల హడావిడి...జంగమయ్యలు, కొమ్మదాసరులు...పగటి వేషాలు...ఇదీ పెద్ద పండగ విశేషాలు...


 పూర్వం రోజుల్లో సంక్రాంతి పండుగ నెలరోజులు ఉందనగా హరిదాసులు ఇంటింటికి తిరిగేవారు. వినసొంపైన కీర్తనలు చెవిన పడగానే ఎంతో హాయిగా ఏదో తెలియని మధురానిభూతి కలిగేది. హరిదాసు రాని రోజు ఉండేదికాదు. హరిదాసు కీర్తనలు, గజ్జెల సప్పుడు అల్లంత దూరం నుంచి వినపడగానే ఇంట్లో మహిళలు బియ్యం, పప్పు దినుసులను పల్లెంలో సిద్ధం చేసేవారు. ఇపుడా సందడి ఏది? హరిదాసులు కనుమరుగవుతున్నారు. ఆ వృత్తి నుండి బయట పడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక గంగిరెద్దులను అందంగా అలంకరించి వాటికి కొన్ని అంశాలపై శిక్షణ ఇచ్చి విన్యాసాలు చేయించేవారు. నాలుగు రోడ్డుల కూడలిలో గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తూ ఆకట్టుకునేవారు.

అయ్యగారికి దండం పెట్టు..అమ్మగారికీ దండం పెట్టు...! అంటూ గంగిరెద్దులతో విన్యాసాలు చేయించేవారు. గుమిగూడిన జనంతో ఆ ప్రాంతం కరతాళ ద్వనులతో మార్మోగేది. ఆ తర్వాత ఇంటింటికి తిరిగి గుమ్మం ముందర సన్నాయి రాగంతో కుటుంబ సభ్యులను పొగడ్తలతో ముంచెత్తేవారు. అష్టైశ్వర్యాలు, పాడి సంపదతో వర్ధిల్లాలని దీవించేవారు.

ఇదంతా ఒకనాటి మాట. ఆధునిక పోకడలతో పల్లెల్లోనూ సంక్రాంతి కళ తప్పింది. గ్రామీణ కళలకు ఆదరణ లేక సంప్రదాయ కళాకారులు కనుమరుగవుతున్నారు. ఇక పట్టణాల్లో కృత్రిమ సంబరాలతో సరిపుచ్చుకుంటున్నారు. పల్లె వాతావరణం నిండుతనాన్ని కోల్పోయింది. ఏదో వెలితితో సంక్రాంతి పండగ గడచిపోతోంది.
 

మరిన్ని వార్తలు