సాహితీ కృషీవలుడు సన్నపురెడ్డి

27 Jun, 2019 09:04 IST|Sakshi

సాక్షి, కడప : జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ‘కొండపొలం’ నవలకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అవార్డు ప్రకటించింది. 2019 సంవత్సరానికిగాను ప్రకటించిన నవలల పోటీలో ఆయన నవలను ప్రత్యేక న్యాయ నిర్ణేతల కమిటీ బహుమతికి ఎంపిక చేశారు. బహుమతిగా రూ. 2 లక్షల మొత్తాన్ని ప్రకటించారు. ఇంతవరకు పోటీలు నిర్వహించిన ఏ సంస్థ తెలుగు నవలకు ఇంత పెద్ద మొత్తాన్ని బహుమతిగా ఇవ్వలేదు. త్వరలో ఆయనకు ఈ బహుమతి అందజేయడడంతోపాటు బహుమతి పొందిన నవలను కూడా ప్రచురించనున్నారు. కథా సాహితీ సహకారంతో నిర్వహించిన ఈ పోటీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచేగాకఅమెరికా నుంచి 58 నవలలు అందాయి.

న్యాయ నిర్ణేతలు పలుమార్లు నవలలను వడపోసి బహుమతికి సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి నవల కొండపొలంను ఎంపిక చేశారు. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లాలోని బాలరాజుపల్లెలో 1963 ఫిబ్రవరి 16న జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకు పాఠాలు బోధించడంతోపాటు స్వగ్రామం నుంచి సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎనిమిది నవలలు, మూడు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి రాశారు. 2017లో తానా నవలల పోటీలో ఈయన రచించిన ‘ఒంటరి’కి బహుమతి లభిం చింది. మొదటి నవల ‘కాడి’కి, ‘తోలుబొమ్మలాట’లకు ఆటా పురస్కారాలు లభించాయి. ఆయన రచించిన మరికొన్ని నవలలు, ఇతర రచనలు, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సన్నపురెడ్డి రచించిన 75కు పైగా కథలు, వివిధ సంకలనాల్లో చోటుచేసుకోవడమే కాకుండా ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనకు ఈ బహుమతి లభించడం పట్ల జిల్లా సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండూరు పిచ్చమ్మ వెంకట్రాజు స్మారక ట్రస్టు, లలిత కళా నికేతన్, భూతపురి సుబ్రమణ్యం స్మారక ట్రస్టు, జానమద్ది సాహితీపీఠం, నారు నాగనార్య సాహితీపీఠం, పోతన సాహితీపీఠం, రాయలసీమ టూరిజం కల్చరల్‌ సొసైటీ ప్రతినిధులు సన్నపురెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.  

మరిన్ని వార్తలు