పేదల బతుకు బుగ్గి

7 Apr, 2016 04:09 IST|Sakshi
పేదల బతుకు బుగ్గి

సంతజూటూరులో భారీ అగ్ని ప్రమాదం
25 గుడిసెలు దగ్ధం
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
20 లక్షల ఆస్తినష్టం

 
బండిఆత్మకూరు: సంతజూటూరు గ్రామంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని బీసీ కాలనీ  పేదలు గుడిసెల్లో నివసిస్తున్నారు. వారు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కూలీకి వెళ్లారు. అయితే వీరి గుడిసెలకు సమీపంలో కంప చెట్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన మంట  ఎగిసి పూడిగుడిసెలను తాకాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మంటలు మరింత పెరిగాయి. పొలాల్లో ఉన్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే అగ్నికి గాలి తోడు కావడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది.  

ఈ ప్రమాదంలో 25 గుడిసెలు, నాలుగు గడ్డి వాములు బూడిదయ్యాయి.  తిండి గింజలు, దుస్తులు, నగదు బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయి. బాధితుడు పిక్కిలి మధుకు చెందిన మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కాలిపోయాయి. వెంకటమ్మ అనే మహిళకు చెందిన రూ.50వేల నగదు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వెంటనే ఆత్మకూరుకు చెందిన అగ్నిమాపకదళ సిబ్బందికి తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తహశీల్దార్ శేషఫణి గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.

ఈ ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. బండిఆత్మకూరుకు చెందిన రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి, డాక్టర్ షరీఫ్ సంఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. రెడ్‌క్రాస్ తరుపున తమవంతు చేయూతనందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు