-

సారా కాస్తే గ్రామ బహిష్కరణ

31 May, 2015 02:19 IST|Sakshi

అమలాపురం టౌన్ : సారా కాచేవారిపై గ్రామ బహిష్కరణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ ఇ.దామోదర్ వెల్లడించారు. సారా కాచేవారిని గుర్తించి మెజిస్ట్రేట్‌ల ముందుంచి, వారి అనుమతితో చట్ట ప్రకారం గ్రామ బహిష్కరణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సారా కాచేవారిపై ఇప్పటికే పీడీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అయితే పీడీ యాక్ట్‌కంటే గ్రామ బహిష్కరణ వారిలో మానసిక పరివర్తన తెస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామ బహిష్కరణపై పలు శాఖల ఉన్నతాధికారులతో చర్చించామన్నారు.
 
 రాజమండ్రి, కాకినాడల్లో పీడీ యాక్ట్ కింద సారా కాచుతున్న ఇద్దరిపై చెరో కేసు నమోదు చేశామన్నారు. సారా కాచేందుకు ఉపయోగించిన స్థల యజమానులపై కూడా ఇకనుంచి కేసులు నమోదు చేస్తామన్నారు. సారా తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని, వీటి నిల్వలు ఎక్కడున్నా సహించేది లేదని చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో సారా కాచేందుకు వీలున్న లంకభూములు, శివారు ప్రాంతాలు, మడ అడవులు తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున నిఘా ఏర్పాటు చేశామని దామోదర్ చెప్పారు. విలేకర్ల సమావేశంలో అమలాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీదేవి, సీఐలు కళ్యాణ చక్రవర్తి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
 
 సారా రహితంగా గోదావరి పుష్కరాలు
 యానాం టౌన్ : గోదావరి పుష్కరాలను సారా రహితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు దామోదర్ తెలిపారు. శనివారం యానాం వచ్చిన ఆయన.. ప్రాంతీయ పరిపాలనాధికారి గిడ్డి బలరామ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. నాటుసారా తయారీ, రవాణా, యానాంలో మద్యం విధానం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పుష్కరాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సారా తయారీ, రవాణాను పూర్తిగా అదుపు చేసేందుకు 90 మందితో స్పెషల్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి రాజమండ్రిలో డంప్ చేసి, రవాణా చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. దీనిపై కూడా నిఘా ఉంటుందన్నారు. సమావేశంలో సీఐ గూటం శివగణేష్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు