మధ్యంతర భృతిపై సర్కారే నిర్ణయం తీసుకోవాలి: పీఆర్సీ

31 Oct, 2013 01:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) స్పష్టం చేసింది. ఇటు తెలంగాణతోపాటు అటు సీమాంధ్రకు చెందిన ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యంతర భృతి మంజూరుపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ పీఆర్సీని ఆర్థికశాఖ కోరింది.
 
 ఈ మేరకు ఫైలును పంపింది. దీన్ని పరిశీలించిన పీఆర్సీ.. మధ్యంతర భృతి ఇవ్వాలా వద్దా అనే అంశం కమిషన్ పరిధిలోకి రాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. గతంలో పీఆర్సీ నివేదికలు జాప్యమైన సందర్భాల్లో మధ్యంతర భృతి ఎంతెంత చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందనే వివరాలను పేర్కొంటూ సంబంధిత ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి పంపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలా? ఇస్తే ఎంతశాతం మేర ఇవ్వాలి అనే విషయంపై సీఎం స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు