గణేశా.. చూడయ్యా తమాషా!

19 Sep, 2013 04:11 IST|Sakshi
మహేశ్వరం, న్యూస్‌లైన్: నాడు ఆకాశానికి ఎగిసి నేడు అవనికి పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగం.. గణేశ్ లడ్డూల వేలంపై ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు రూ.లక్షలు వెచ్చించి లడ్డూలను దక్కించుకునేందుకు ఆరాటపడిన వారంతా ప్రస్తుతం రూ. వేలకే పరిమితమవుతున్నారు. దీనికి తాజా తార్కాణం బుధవారం మండంలోని సర్దార్‌నగర్ గణేశ్ లడ్డూ రూ.6,500కే ఇదే గ్రామానికి చెందిన తాళ్ల పాండు వేలంలో దక్కించుకోవడం. 2007లో రూ.17 లక్షల 2వేలకు సర్దార్‌నగర్ వినాయకుడి లడ్డూను ఇదే గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారంటే.. రియల్ ఎస్టేట్ రంగం ఎంత దిగాలు పడిందో అవగతమవుతోంది. 
 
 మండలంలోని యేటికేడాది రియల్ ఎస్టేట్ వ్యాపారం చల్లబడుతుండడంతో లడ్డూల వేలానికి ఎవరూ ఆసక్తి చూపడంలేదు. మండలంలో రియల్ రంగం కుదేల్ అయ్యాక వ్యాపారులు, నాయకులు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది మండలంలోని తుక్కుగూడ బొడ్రాయి వద్ద నెలకొల్పిన గణేశ్ లడ్డూ రూ.1.04 లక్షలకు ఇదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌రెడ్డి కైవసం చేసుకున్నారు.  ఈసారి ఇంత పెద్ద మొత్తంలో లడ్డూ ధర పలకడం విశేషం. అప్పట్లో లక్షలు పలికిన వినాయక లడ్డూలు ప్రస్తుతం ఇంత తక్కువకు పడిపోవడానికి రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడమేనని ప్రధాన కారణం. ఈ ప్రాంతానికి చెందిన నాయకులు, రియల్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొని, కొందరు విచ్చలవిడిగా ఖర్చు చేసి తీవ్రంగా నష్టపోయారు. కొందరైతే అప్పుల్లో కూరుకుపోయి కొలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ కారణంగానే లడ్డూలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు