రసాభాసగా చీరల పంపిణీ

7 Nov, 2014 02:19 IST|Sakshi
రసాభాసగా చీరల పంపిణీ

వితరణం
రసాభాసగా హుద్‌హుద్ బాధితులకు చీరల పంపిణీ
భారీగా తరలిరావడంతో తొక్కిసలాట
కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం

 
సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమం రసాభసా అయింది. ఊహించని రీతిలో తరలివచ్చిన బాధితులకు కిట్‌లు పంపిణీ చేయలేక కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. టర్నర్ చౌల్ట్రీలోని విశాఖ సెంట్రల్ ఎదురుగా సుమారు 14 డివిజన్లకు చెందిన బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీ సీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నా రు. సాయం పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి సాయం అందే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని 50 వేల మంది బాధితులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అనంతరం ఓ అరడజను మందికి నేతలు దుప్పట్లు, చీరల కిట్‌లను పంపిణీ చేశారు. డివిజన్‌కు 400 మంది వంతున నగర పరిధిలోని పది డివిజన్ల నుంచి ప్రత్యేకంగా కూపన్లు పంపిణీ చేశారు. కూపన్లున్న బాధితులు మాత్రమే రావాల్సిందిగా సూచించారు. వీరి కోసం విశాఖ సెంట్రల్ ఎదురుగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీరేనా బాధితులు.. మేము కాదా అంటూ వేలాదిగా వచ్చిన బాధితులు నాయకులతో వాగ్వాదానికి దిగా రు. అర్హులైన వారికి కాకుండా పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేశా రు.

నాయకులు వారించినా వినిపించుకోకుం డా కౌంటర్లలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశా రు. దీంతో పరిస్థితి చేజారిపోతుందనే భయం తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ముఖ్య నేతలంతా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మిగిలిన నాయకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అంతవరకు క్యూలైన్లలోఉన్న వారు సైతం ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు తోసుకురావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
 
ఒకదశలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో బాధితులు కిందపడి పోయారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య బాధితులతో పాటు కార్యకర్తలు కూడా కౌంటర్లలోకి చొరబడి అందినకాడికి పట్టుకుపోయారు. రెండు మూ డు వందల మందికి కూడా పంపిణీ చేయకుం డానే కిట్‌లు మాయం కావడంతో నాయకులు కూడా చేసేది లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్‌అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ సిటీఅధ్యక్షురాలు రమణికుమారి, ఎస్సీ సెల్ చైర్మన్ కె.వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు