చీరలు దొంగిలించారు. ఆ తరువాత!

31 Jul, 2019 09:42 IST|Sakshi
షాపులోకి ప్రవేశిస్తున్న మహిళలు, దొంగిలించి వదిలి వెళ్లిన చీరలు

సాక్షి, మంగళగిరి(గుంటూరు) : అనుకొన్న ప్రణాళిక ప్రకారం పక్కాగా దొంగతనం చేశారు. కాని పట్టుబడతామేమోనని దొంగిలించిన వాటిని వదిలివెళ్లారు. ఈ ఘటన మంగళగిరి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మంగళగిరి పట్టణ పరిధిలోని పాత మంగళగిరిలోని దింపుడుకళ్లం సెంటర్‌ వద్ద ఉన్న శ్యామలాదేవి హ్యాండ్‌లూమ్స్‌కు మంగళవారం మధ్యాహ్నం చీరల కొనుగోలుకు ఐదుగురు మహిళలు వచ్చారు. చీరలు చూపించమని అక్కడ ఉన్న యజమానిని, గుమాస్తాలను అడిగారు. ఒకరి తర్వాత ఒకరు హడావుడి చేస్తూ చీరలను చూసే సమయంలో వచ్చిన మహిళలు కొన్ని చీరలను దొంగతనం చేశారు. అయితే ఏమీ నచ్చలేదంటూ తిరిగి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన కొద్ది సమయానికి ఓ యువకుడు షాపులోకి వచ్చి కాటన్‌ షర్టు బిట్లు చూపించమని అడగ్గా, ఆ కొట్టు యజమాని కొద్ది సేపు ఉండమని, సీసీ కెమెరా ఫుటేజ్‌ పరిశీలిస్తున్నట్లు ఆ యువకుడికి తెలిపాడు.

ఇంతలో ఆ యువకుడు ఏమైందంటూ ఆత్రంగా అడగ్గా, మీరేం చేస్తారంటూ ఆ యువకుడ్ని ప్రశ్నించాడు. ఆ యువకుడు డీజీపీ ఆఫీసులో పనిచేస్తానంటూ సమాధానం చెప్పాడు. అయితే మీతో పనిపడేలా ఉందంటూ సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తూ, ఇప్పుడే వచ్చి వెళ్లిన ఐదుగురు మహిళలు చీరలు దొంగతనం చేసి ఉండవచ్చని క్షుణ్ణంగా చూశాడు. ఆ ఫుటేజ్‌లో మహిళలు చీరలను దొంగిలిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో, ఆ యువకుడికి విషయం తెలియజేశాడు. ఇంతలో యువకుడు ఇప్పుడే వస్తానంటూ బయటకు జారుకుని కొద్దిసేపటి తర్వాత షాపుకి ఫోన్‌ చేసి, మీ చీరలను తీసుకువెళ్లింది మా వారేనని, పొరపాటున తీసుకువెళ్లారు, ఎవరికీ చెప్పవద్దంటూ తెలియజేశాడు.

మీ చీరలను మీ షాపు ఎదురుగా ఉన్న కూల్‌డ్రింక్స్‌షాపు పక్కనే పెట్టామని, అవి తీసుకొని మర్చిపోండంటూ ఫోన్‌లో యజమానికి తెలియజేసి, ఫోన్‌ కట్‌ చేశాడు. హడావుడిగా షాపు యజమాని ఎదురుగా ఉన్న షాపు దగ్గరకు వెళ్లి చూడగా, ఓ సంచిలో చీరలు పెట్టి ఉన్నట్లు గమనించి, ఆ సంచిని షాపునకు తీసుకువెళ్లాడు. ఒక్కొక్క చీర విలువ సుమారు రూ.6వేలు పైనే ఉంటుందని, మొత్తం 7 చీరలను వారు వదిలివెళ్లినట్లు, వాటి విలువ సుమారుగా రూ.40వేలకు పైగా ఉంటుందని షాపు యజమాని తెలియజేశాడు. అయితే ఈ ఏడు చీరలే తీసుకువెళ్లారా, ఇంకేమైనా దొంగిలించి ఉంటారా అనేది స్పష్టంగా తెలియదంటూ యజమాని పేర్కొన్నాడు. ఇంత జరిగినా షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు