ప్రతిపాదనలు సరే..కేటాయింపుల మాటేంటి?

27 Jul, 2014 03:05 IST|Sakshi
ప్రతిపాదనలు సరే..కేటాయింపుల మాటేంటి?
  •      తెలుగుగంగకు రూ.334 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించిన అధికారులు
  •      హంద్రీ-నీవాకు రూ.750 కోట్లు, గాలేరు-నగరికి రూ.550 కోట్లు ఇవ్వాలని నివేదన
  •      సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌కు రూ.150 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదన
  •      బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయిస్తేనేకొలిక్కి వస్తాయంటున్న అధికారులు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా దశ, దిశను మార్చే సాగునీటి ప్రాజెక్టుల పనులకు 2014-15 బడ్జెట్లో రూ.1,784 కోట్లను కేటాయించాలని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధులు కేటాయిస్తే పనులను శరవేగంగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని నివేదించారు. అధికారులు ప్రతిపాదించిన మేరకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 10న అప్పటి కిరణ్ సర్కారు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది.

    ఆగస్టు రెండో వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కారు సమాయత్తమవుతోంది. ఆ క్రమంలోనే నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల అధికారులను ప్రతిపాదనలు పంపాలని కోరింది. దుర్భిక్ష చిత్తూరు జిల్లాను కృష్ణా జలాలతో అభిషేకించి సుభిక్షం చేయాలని దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి నిర్ణయించారు.

    జలయజ్ఞంలో భాగంగా హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులను చేపట్టారు. వైఎస్ హయాంలో నిధులు భారీ ఎత్తున కేటాయించడంతో పనులు శరవేగంగా సాగాయి. హంద్రీ-నీవా తొలి దశ పూర్తయింది. గాలేరు-నగరి తొలి దశ పాక్షికంగా పూర్తయింది. తెలుగుగంగ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చింది. స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులకు అవసరమైన పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను అప్పట్లోనే తెచ్చారు. వైఎస్ హఠాన్మరణం సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారింది. రోశయ్య ప్రభుత్వంలో గానీ.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో గానీ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
         
    రాయలసీమలో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద మన జిల్లాలో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. హంద్రీ-నీవాకు ఇప్పటిదాకా రూ.5,100 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.1,750 కోట్ల విలువైన పనులు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.416 కోట్లను కిరణ్ సర్కారు కేటాయించింది. ఇప్పుడు కనీసం రూ.750 కోట్లను కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు.
         
    గాలేరు-నగరి ప్రాజెక్టు కింద కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల పరిధిలో 3.25 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇందులో మన జిల్లాలో 1.03 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కిరణ్ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.321.50 కోట్లు కేటాయించింది. పూర్తి స్థాయి బడ్జెట్లో కనీసం రూ.550 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు.
         
    తెలుగుగంగ ప్రాజెక్టు కింద నెల్లూరు, చిత్తూరు జిల్లా ల్లో 1.40 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇందులో మన జిల్లాలోనే 49 వేల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే మరో రూ.700 కోట్లు అవసరం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.154 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కనీసం రూ.334 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు.
         
    సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా 87,734 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు కొత్తగా 23,666 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.300 కోట్లు. అటవీ భూవివాదం పరిష్కారం కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. కిరణ్ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ప్రస్తుతం రూ.150 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు.
     

మరిన్ని వార్తలు