సరిత.. కీలక నేత

2 Jun, 2016 01:55 IST|Sakshi

ఆమెతో పాటు మరో ఇద్దరు  మహిళా మవోస్టులు  లొంగుబాటు
ఇద్దరిపై నాలుగేసి లక్షలు, మరొకరిపై రూ.లక్ష రివార్డు

 

పెదవాల్తేరు (విశాఖ): పోలీసులకు బుధవారం లొంగిపోయిన ముగ్గురు మహిళా మవోయిస్టులపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరంతా దళంలో చురుగ్గా పనిచేసిన వారే. లొంగిపోయినవారిలో ఫస్ట్ సి ఆర్ సి కంపెనీ కమాండర్  కుడబాల లక్ష్మి ఎలియాస్ సరిత, ఏసీఎం కేడర్ నేత బోనంగి రాములమ్మ ఎలియాస్ భారతి, దళ సభ్యురాలు తాంబేలు తుమ్ము, ఎలియాస్ విజయకుమారి ఉన్నారు. వీరిలో సరిత అత్యంత కీలక మహిళా నేతగా పనిచేశారు.  వీరి వివరాలను ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ బుధవారం మీడియాకు వివరించారు. 

 
సరితపై  33 కేసులు, రూ.4 లక్షల రిమాండ్

డీసీఎం స్థాయి నేత సరిత (29)  ఎంతో చురుగ్గా పనిచేశారు.  ఏవోబీ తొలి మహిళ  కమాండర్ స్థాయికి ఎదిగారు. జి.కె.వీధి మండలం, వంచుల పంచాయితీ శ్యామగెడ్డ ఈమె స్వగ్రామం. 2000లో దళంలో చేరారు.  ఏకే 47 కలిగిన తొలి మహిళా నేత.    సీలేరు సంతలో 2008 మే 28న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి తుపాకులు ఎత్తుకు వె ళ్లడం,  2004లో కోరాపుట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్ పైదాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడం, 2015 జనవరి 1న జై సర్పంచ్  సాగిన వెంకటరమణ  హత్య తదితర సంఘటల్లో ఆమె పాల్గొంది.

 
భారతక్క కూడా కీలక నేతే : మరో మహిళా కీలకనేత, జి.కె.వీధి మండలం బలపం పంచాయతీ లబడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి రాములమ్మ ఎలియాస్ భారతక్క, ఎలియాస్ సరోజపై కూడా రూ.4 లక్షల రివార్డ్,  34 కేసులున్నాయి. అనకాపల్లి పోలీసుస్టేషన్ పైదాడి, దారకొండ పోలీసు అవుట్‌పోస్ట్‌పై దాడి వంటి కేసులున్నాయి.  కోరుకొండ, గాలికొండ, పెదబయలు, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో  పనిచేసింది. 2005లో ఏసీఎం క్యాడర్‌గా పదోన్నతి పొంది 20 ఏళ్ళు విశాఖ ఏవోబీలో పనిచేసింది.

 
విజయపై లక్ష రివార్డ్ : జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయితీ పనసగొంది గ్రామానికి చెందిన తాంబేలు తుమ్ము, ఎలియాస్ విజయ సొంత అన్న తాంబేలు నాగేశ్వరరావు, బావ అప్పారావు  మావోయిస్టు పార్టీలో ఉండడంతో  దళంలో చేరింది. ఈమెపై రూ. లక్ష  రివార్డుతో పాటు 8 నేరాలున్నాయి.

మరిన్ని వార్తలు