‘లెక్క’చెప్పాల్సిందే..

3 Aug, 2013 05:03 IST|Sakshi

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థులు చేసిన ఖర్చు చూపించాల్సి ఉంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసిన అభ్యర్థులు 45 రోజుల్లో ఎన్నికల ఖర్చుల వివరాలు సంబంధిత అధికారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి వారిని భవిష్యత్‌లో పోటీచేసేందుకు అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. జిల్లాలో 1323 పంచాయతీలు, 13,464 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వీటిలో 3922 మంది అభ్యర్థులు సర్పంచ్, 29,292 మంది వార్డు సభ్యులుగా పోటీచేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మేజర్ పంచాయతీల్లో పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు రూ.80 వేలు, వార్డుసభ్యులు రూ.10వేలు, అదేవిధంగా మైనర్ పంచాయతీల్లో పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థులు రూ.40 వేలు, వార్డు సభ్యులు ఆరువేలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చుచేయాల్సి ఉంటుంది. అయితే ఒకటిరెండు మేజర్ పంచాయతీల్లో కొంతమంది అభ్యర్థులు దాదాపు రూ.75 లక్షల వరకు ఖర్చుచేసిన వారు కూడా ఉన్నారు.
 
 మైనర్ పంచాయతీల్లో కూడా చాలామంది సర్పంచ్ అభ్యర్థులు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మేర ఖర్చుచేశారు. దీంతో ఖర్చుల వివరాలను రికార్డుల్లో ఏవిధంగా చూపాలో అర్థంకాక ఇప్పటికీ వాటిని అధికారులకు ఇవ్వలేదు. నామినేషన్ల ఉప సంహరణ రోజు నుంచి పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి మూడు రోజులకు ఒకమారు ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రతి మండలంలో ఒక ఆడిటర్‌ను ఏర్పాటు చేశారు. కాగా, వారి వద్దకు వెళ్లేవారు లేకపోవడంతో పనిలేక ఆడిటర్లు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది.
 
 అనర్హత వేటుకు అవకాశం
 జిల్లాలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన 33,214 మందిలో ఇప్పటివరకు 120మంది మాత్రమే ఎన్నికల ఖర్చుల వివరాలను సంబంధిత అధికారులకు ఇచ్చారు. ముఖ్యంగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారి ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే వారిపై అనర్హతవేటు వేసే అధికారం కూడా ఎన్నికల అధికారులకు ఉంటుంది. గతంలో పోటీచేసిన వారిలో చాలామంది ఎన్నికల ఖర్చు రికార్డులు ఇవ్వకపోగా, వారందరికీ పదేపదే నోటీసులు ఇచ్చినా స్పందించిన దాఖలాల్లేవు. ఈ దఫా వెనువెంటనే నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజర్వుడ్ పంచాయతీల్లో పోటీచేసిన వారిలో ఎక్కువమంది నిరక్షరాస్యులు ఉండటంతో ఖర్చుల వివరాలు ఏవిధంగా రాయాలో తెలియడం లేదు. ఆ వివరాలు మేమెందుకు ఇవ్వాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
 
 

మరిన్ని వార్తలు