సర్పంచ్‌లు నిధులు డ్రా చేసుకోవచ్చు

24 Dec, 2013 00:18 IST|Sakshi

 యాచారం, న్యూస్‌లైన్:  గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘాల నిధులు పుష్కలంగా ఉన్నాయి, నిబంధనల ప్రకారం బిల్లులు పెట్టి  సర్పం చ్‌లు నిధులు డ్రా చేసుకోవచ్చని ఈఓఆర్‌డీ శంకర్‌నాయక్ వెల్లడించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘సర్పంచ్‌లకు అప్పుల తిప్పలు’ అనే కథనానికి ఆయన స్పందించారు. కొద్ది రోజుల కింద ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం, రాష్ట్రం ఆర్థిక సంఘాలతో పాటు  ఇతర పద్దుల కింద నిధులు మంజూరు చేసిందని తెలిపారు. వివిధ పద్దుల కింద మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో దాదాపు రూ.40 లక్షల వరకు నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు.
 
 సర్పంచ్‌లుగా ఎన్నికైన నాటి నుంచి  మండలంలో కొన్ని గ్రామాల్లో మినహా అధిక గ్రామాల్లో పైస నిధులు లేకపోవడం వాస్తవమేనన్నారు. సర్పంచ్‌లు తరుచూ కాలిపోతున్న బోరుమోటార్లు, స్టార్టర్ల, వీధిలైట్ల మరమ్మతుల కోసం అప్పులు చేసి మరమ్మతులు చేస్తున్నది తన దృష్టికి వచ్చిందన్నారు.  ప్రస్తుతం నిధులు ఆయా పంచాయతీల్లో జమ కావడం వల్ల  నిబంధనల ప్రకారం ఖర్చు చేసిన నిధులను డ్రా చేసుకోవచ్చని  తెలియజేశారు. పలు గ్రామాల్లో మాయమైన బోరుమోటార్లు విషయమై కూడా విచారణ జరిపిస్తానని తెలిపారు.  కథనానికి స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్ ఇబ్రహీంపట్నం డివిజన్ డీఈ విజయలక్ష్మి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ...  మండలంలో నీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైన నిధులు, బోరుమోటార్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.  బోరుమోటార్ల మరమ్మతుల కోసం అప్పుల తిప్పలపై సాక్షిలో కథనం ప్రచురించడం పట్ల వివిధ గ్రామాల సర్పంచ్‌లు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడి హర్షం వ్యక్తం చేశారు.
 
 

మరిన్ని వార్తలు