ఇవేం ఆంక్షలు..!

27 Mar, 2017 13:46 IST|Sakshi

► కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం

► రాష్ట్రం వాటా ఇవ్వకపోగా వచ్చిన నిధులపై కొర్రీలు
విజయనగరం కంటోన్మెంట్‌ : అత్త సొమ్ముపై అల్లుడి పెత్తనమన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించడాన్ని సర్పంచ్‌లు తప్పుబడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా తిరిగి కేంద్రం నుంచి వచ్చిన నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించడంతో మాకెందుకీ నిబంధనలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న 938 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ఆధారం.

దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలనే నానుడి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి సహకరించకపోగా కొర్రీలు వేస్తుండడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. జిల్లాకు ఇటీవల 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.43.31 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అయితే మంజూరైన రూ.43 కోట్లలో రూ.4.64 కోట్లు జెడ్పీకి బదలాయించారు. మిగతా నిధులను ట్రెజరీల ద్వారా పంచాయతీలకు సర్దుబాటుచేశారు.
చంద్రన్నబాటకు నిధులు..

పంచాయతీలకు కేటాయించిన నిధులను చంద్రన్నబాటలో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సుమారు 50 శాతం నిధులు సీసీ రోడ్లకే కేటాయించాలని ఆదేశించడంతో సర్పంచ్‌లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే సిమెంట్‌ తక్కువ ధరకు బేరమాడిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సిమెంట్‌ వచ్చేలా చర్యలు తీసుకోవడం లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. జిల్లాకు రావాల్సిన సిమెంట్‌కు తాము ముందుగానే డీడీలు తీస్తున్నా కంపెనీలు పట్టించుకోవడం లేదని, పైగా 14వ ఆర్థిక సంఘ నిధులు కూడా సీసీ రోడ్లకే కేటాయించాలని నిబంధన విధించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

అలాగే మరో 30 శాతం నిధులను మలవిసర్జన రహిత గ్రామాల కోసం వెచ్చించాలన్నారు. అది కూడా ఓడీఎఫ్‌గా ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ నిధులను గ్రామాలకు ఖర్చు చేయాలని నిబంధన విధించారు. అలాగే మరో పది శాతం నిధులు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కులకు , మరో పది శాతం నిధులను ఈ పంచాయతీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో జనరల్‌ ఫండ్స్‌ లేకపోవడం, వచ్చిన నిధులు ఇతర పనులకు వినియోగిస్తే పంచాయతీలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయని సర్పంచ్‌లు ప్రయత్నిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు