పండగ పూటా పస్తులే..

21 Oct, 2018 15:20 IST|Sakshi

రాయవరం (మండపేట) : పండగ వస్తుందంటే ఎవరికైనా సరదా ఉంటుంది. అందులోనూ దసరా పండగ అంటే అందరికీ సరదాయే. కానీ రెండు నెలలుగా వేతనాలకు నోచుకోని సర్వశిక్షా అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం దసరా పండగ సరదా లేకుండా సాగిపోయింది. రానున్న దీపావళికైనా తమ బతుకుల్లో వెలుగు విరబూస్తాయా  అనే ఆశతో వీరంతా ఉన్నారు. అసలే అరకొర వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వీరికి, రెండు నెలలుగా జీతాలు రాక పోవడంతో వడ్డీలకు అప్పులు తెచ్చి జీవనం సాగిస్తున్నారు. 

రూ.6 కోట్ల బకాయిలు...
జిల్లాలోని సర్వశిక్షా అభియాన్‌ పరిధిలో 64 మంది ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్లు, 64 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 322 మంది సీఆర్పీలు, 64 మంది మెసెంజర్లు, 736 మంది పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు, 128 మంది ఐఈఆర్‌టీలు, 15 మంది డీఎల్‌ఎంటీలు, 250 మంది వరకు కేజీబీవీ సిబ్బంది, 24 మంది సైట్‌ ఇంజినీర్లు, 64 మంది భవిత కేంద్రాల ఆయాలు పని చేస్తున్నారు. వీరికి నెలకు సుమారుగా రూ.3 కోట్ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. జూలై నెల వరకు వేతనాలు మంజూరయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు  సంబంధించి వేతనాలు మంజూరు కాలేదు. దీంతో జిల్లాలో ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6 కోట్ల వరకు వేతన బకాయిలు చేరుకున్నాయి.

పండుగ పూటా పస్తులతోనే...
రెండు నెలలుగా వేతనాలు రాక పోవడంతో దసరా పండుగ  ఉసూరుమంటూ  గడిపామని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరకొరగా ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదంటున్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమతో సక్రమంగా పని చేయించుకుంటున్న ప్రభుత్వం మాత్రం సమయానికి వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం...
రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పండుగ సమయంలోనైనా ముందుగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. చాలా మంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వెంటనే వేతన బకాయిలు చెల్లించాలి.
– ఎం.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం,అల్లవరం మండలం

బడ్జెట్‌ రాగానే చెల్లిస్తాం...
కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్‌ ఇంకా రాలేదు. బడ్జెట్‌ రాగానే అందరు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తాం. ఉద్యోగుల ఇబ్బందులను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం.
– మేకా శేషగిరి, పీవో, సర్వశిక్షా అభియాన్, కాకినాడ 

మరిన్ని వార్తలు