సమగ్ర (ఆకలి)శిక్షా అభియాన్‌ !

10 May, 2019 10:32 IST|Sakshi
పీలేరు ఎమ్మార్సీ కార్యాలయం

రెండు నెలలుగా అందని జీతాలు

కుటుంబపోషణ భారమైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం

చిత్తూరు, పీలేరు : సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్‌ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. రెం డు నెలలుగా జీతాలు అందకపోవడంతో అతికష్టం పై బతుకు బండిని లాక్కొస్తున్నారు. జీతాలు ఎప్పు డు ఖాతాల్లో జమవుతాయోనని నిరీక్షిస్తున్నారు.

జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌లో 807 మందికిపైగా పనిచేస్తున్నారు. వారిలో 350 మంది సీఆర్‌పీలు, 66 మంది ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్లు, 66 మంది డేటా ఎంట్రీలు, 325 మంది పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు, 120 మంది ఐఈఆర్‌టీ ఉపాధ్యాయులు, 66 మంది మెసెంజర్లు, 10 నుంచి 12 మంది డివిజనల్‌ మానిటరింగ్‌ బృందం, మరి కొంత మంది జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీలకు నెలకు రూ. 17,600, ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్లకు రూ. 19100, డేటా ఎంట్రీలకు రూ. 17,600, పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లకు రూ. 14,200, ఐఈఆర్‌టీ ఉపాధ్యాయులకు రూ. 20250, ఆయాకు రూ. 4,500 జీతంగా చెల్లిస్తారు. ప్రతి నెలా 15వ తేదీపైన 30వ తేదీలోపు జీతాలు ఇవ్వడం సాధారణంగా మారింది. రెండు నెలలుగా వీరికి జీతాలు అందలేదు.  మార్చి, ఏప్రిల్‌కు సంబంధించిన జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

విద్యాశాఖలో వీరి పాత్ర కీలకం
జిల్లా విద్యాశాఖలో సమగ్ర శిక్షాఅభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. సీఆర్‌పీలు ప్రతి రోజూ ఒక పాఠశాలను సందర్శించి ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం పంపాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రతి కార్యక్రమంలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. విద్యాసంబంధమైన కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషించాలి. బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం, వారి నమోదు తర్వాత నిలకడ కోసం కీలకంగా వ్యవహరించాలి. రెగ్యులర్‌ పాఠశాలల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం,  యూనిఫాం, మధ్యాహ్న భోజనం, స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ, పరీక్షపత్రాల పంపిణీ, ఆధార్‌ సీడింగ్, ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్, జియో ట్యాగింగ్‌ సర్వే, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాల్లో కీలక పోత్ర పోషిస్తారు. డేటా ఎంట్రీలు రోజూ జిల్లా విద్యాశాఖకు సంబంధించిన గణాంకాలను పూర్తి చేయడం, ఉపాధ్యాయుల జీతభత్యాలు, సెలవుల నమోదు, మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలపై గణాంకాలు ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా విద్యాశాఖకు పంపాలి. ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్లు...విద్యార్థుల నమోదు, పాఠశాలల పనితీరు, వివరాలు సేకరించాలి. ఆయా పాఠశాలల పరిధిలోని విద్యార్థుల సమగ్ర నివేదిక రూపొందించడం, వివిధ ప్రాంతాల నుంచి రోజువారీ విద్యార్థుల ట్రాన్స్‌పోర్ట్‌ తదితర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఇంత చేస్తున్నా సకాలంలో జీతాలు అందలేదని పలుమార్లు సంబంధిత జిల్లా అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం.

టీఏ కూడా పెండింగ్‌
సీఆర్‌పీలకు 2018 జూలై నుంచి (దాదాపు 10 నెలలుగా) నెలనెలా రావాల్సిన టీఏ రూ. 600 ఇప్పటివరకూ మంజూరుకాలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో టీఏ బిల్లులు చెల్లించినా చిత్తూరులో ఇవ్వలేదు. గతంలో నిర్వహించిన స్లాష్‌ పరీక్షలు, కోడింగ్‌కు చెల్లించాల్సిన నగదు ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు