ఖైదీ దర్జా.. ఆస్పత్రే అడ్డా

18 Apr, 2019 10:57 IST|Sakshi
ఆస్పత్రిలోని ప్రిజన్‌ వార్డు

సర్వజనాస్పత్రిలో ఖైదీ మకాం  

ఉత్తుత్తి రోగాలతో అడ్మిషన్‌

ఆస్పత్రి ముఖ్య అధికారికి భారీగా ముడుపులు

మూడు నెలలుగా సేవలందిస్తున్న సిబ్బంది

ఆయన చేయి తడిపితే చాలు...ఆస్పత్రిలో ఎవరైనా సరే సలాం చేస్తారు. కంటిమీద కునుకు లేకుండా సేవ చేస్తారు. రిపోర్టులు కూడా ఎలా కావాలంటే అలా రాసిస్తారు..ఈ విషయం తెలుసుకున్న ఓ ఖైదీ మూడు నెలలుగా ఇక్కడ తిష్ట వేశాడు. సదరు ఆస్పత్రి కీలక అధికారికి రూ.లక్షలు ముట్టజెప్పాడు. అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తూ హాయిగా రెస్ట్‌ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరిలో అనారోగ్య సమస్య ఉందంటూ రెడ్డిపల్లి జైలు నుంచి వచ్చిన ఖైదీ ఇక్కడే ఉండిపోయాడు. రిపోర్టులన్నీ నార్మల్‌గానే ఉన్నా... రోజుకో సమస్య చెబుతూ సపర్యలు చేయించుకుంటున్నాడని ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. 

అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో నిబంధనలు బంధీలుగా మారాయి. చేయి తడిపితే చాలు ఏ పనైనా సులువుగా చేయించుకోవచ్చనే చందంగా తయారైంది ఇక్కడి పరిస్థితి. ఆస్పత్రిలోనే ప్రిజన్‌ వార్డులో తాజాగా వెలుగుచూసిన ఓ బాగోతం ఈ మాటలకు అద్దం పడుతోంది. ఆ వివరాలిలా ఉన్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు పెద్దాసుపత్రిలో ప్రిజన్‌ వార్డు ఉంది. రక్త విరేచనాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి 3 నెలల క్రితం  ఈ వార్డులో చేరాడు. ఆస్పత్రి సిబ్బంది సర్జరీ కింద ఆయనకు అడ్మిషన్‌ ఇచ్చారు. మెడిసిన్‌ సమస్య ఉందని మరో నెల పొడిగించారు. ప్రస్తుతం ఆర్థో సమస్య ఉందని ఆ వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారు.

రిపోర్టుల్లో కండీషన్‌ నార్మల్‌..
ఇదిలా ఉంటే, సదరు వ్యక్తికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టుల్లో మాత్రం ఆయన కండీషన్‌ నార్మల్‌గా ఉన్నట్లు నిర్ధారణ అవడం చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నా ఎందుకు అతడిని ఇంకా వార్డులో కొనసాగిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సదరు ఖైదీ మామూలు స్థితిలో ఉన్నా వార్డులో ఉంచి సపర్యలు చేయడం వెనుక ఆంతర్యమేమిటో ఆయనకు వైద్య సేవలు అందింస్తున్న వారికే తెలియాలి.

రూ.లక్షల్లో బేరం!
ఈ విషయంపై పరిశీలన జరిపితే ఆసత్పికి సంబంధించిన ఓ కీలకాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ప్రిజన్‌ వార్డులో రోగిని అడ్మిషన్‌లో ఉంచడానికి సదరు అధికారికి, ఖైదీకి రూ. లక్షల్లో బేరం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ అధికారి వచ్చినప్పటి నుంచే ఇలాంటి అక్రమాలు మొదలయ్యాయని పలువురు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన చేయి తడిపితే ఏ పనైనా సరే ఇట్టే అయిపోతుందని అక్కడి కొందరు సిబ్బందినడిగితే తెలిసింది.  ఏమైనా అంటే నిబంధనల గురించి మాట్లాడే ఆయనే.. అవేవీ తనకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ అయినా స్పందించి, మరిన్ని అక్రమాలకు తావివ్వకుండా సదరు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

విచారించిచర్యలు తీసుకుంటా
ప్రిజన్‌ వార్డులో మూడు నెలలుగా ఓ ఖైదీ ఉన్న విషయం తెలియదు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తా. అక్రమం జరిగిందని తెలిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటా.   – డాక్టర్‌ జగన్నాథ్,ఆస్పత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు