రామా.. కనవేమిరా!

20 Feb, 2020 11:14 IST|Sakshi
వెళ్లేదెట్టా.. కుర్చీల బండిపై ఇంత రద్దీలో పైఅంతస్తులోకి ఎలా వెళ్లాలో తెలియక కిందనే ఉండిపోయిన వృద్ధుడు

సదరం..  నరకం

సర్వజనాస్పత్రి అధికారులబాధ్యతారాహిత్యం

మొదటి అంతస్తులోవైద్య శిబిరం

పనిచేయని లిఫ్ట్‌...స్ట్రెచర్‌లూ కరువు

అల్లాడిపోయిన వృద్ధులు, దివ్యాంగులు

ఆపసోపాలతోచాలా మంది వెనక్కు

కుర్చీలకే పరిమితమైన వారు.. కాలు భూమిపై మోపలేని వారు.. మనిషి సాయంలేనిదే నడవలేనివారు.. వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, వృద్ధులు.. వీరిని చూస్తే ఎవరికైనా అయ్యోపాపం అనిపిస్తుంది. కానీ సర్వజనాస్పత్రి నిర్వాహకులు మాత్రం కనీస మానవత్వం చూపలేకపోయారు. బుధవారం ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో సదరం శిబిరం ఏర్పాటు చేసి దివ్యాంగులకు నరకం చూపించారు. ఒక్కోమెట్టు ఎక్కేందుకు ఒక్కొక్కరు పడిన కష్టం చూసి అక్కడున్న వారే అయ్యో అంటూ తల్లడిల్లిపోయారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు మాత్రం ప్రశ్నించిన వారితో వితండవాదం చేయడం గమనార్హం.

అనంతపురం న్యూసిటీ: తొమ్మిది రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి సామాజిక పింఛన్లు మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వెల్లడించింది. దీంతో తలసీమియా, హీమోఫీలియా, సికెల్‌సెల్‌ అనీమియా, ఎలిఫాంటియాసిస్‌(బోదకాలు), మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, కండరాల బలహీనత, యాక్సిడెంట్‌కు గురై(చక్రాల కుర్చీ/మంచానికి పరిమితమైన వారు), కుష్టు రోగులు(బహుళ వైకల్యం), కిడ్నీ, కాలేయం, గుండె మార్పి జరిగిన వారికి మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ మంజూరు కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, చిన్నపిల్లల విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ మల్లీశ్వరి, తదితరులు దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు, పాతరిపోర్టులను పరిశీలించారు. శిబిరానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా రోగులు తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్‌ చేయడం ఇబ్బందిగా మారింది. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌ చాంబర్‌ ముందున్న మొదటిఫ్లోర్‌ వికలాంగులతో కిక్కిరిసిపోయింది. ఎఫ్‌ఎం, ఎంఎం, ఐసీసీయూ, చిన్నపిల్లల వార్డు, సర్జికల్‌ వార్డులకు వెళ్లేందుకు వీల్లేకుండా వికలాంగులు బారులు తీరారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. శిబిరాన్ని మొదటి అంతస్తులో నిర్వహించగా.. దివ్యాంగులు ఫస్ట్‌ప్లోర్‌ చేరుకోవడానికి నరకం చూశారు. నడిచేందుకు కూడా వీలులేని స్థితిలో ఉన్నవారు మోకాళ్లతో దోక్కుంటూ మెట్లు ఎక్కడానికి అల్లాడిపోయారు. తీరా సర్టిఫికెట్ల మంజూరు గదికి వచ్చే సరికి వందల సంఖ్యలో దివ్యాంగులు బారులు తీరారు. 

పసిపిల్లల గావుకేకలు
వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సదరం సర్టిఫికెట్‌ తీసుకోవడం.. ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లను ధ్రువీకరించుకునేందుకు చాలా మంది చంటిబిడ్డలతో వచ్చారు. ఒళ్లో చంటిబిడ్డ.. మరో చేతిలో అనారోగ్యంతో ఉన్న పిల్లలతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం కిటకిటలాడగా గాలిసైతం వీయక పసిపిల్లల ఏడ్పులతో ఆస్పత్రి మార్మోగింది. చిన్నారుల ఇబ్బందులు చూసి తట్టుకోలేని చాలా మంది వెనక్కివెళ్లిపోయారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలోనే కూర్చుండిపోయారు. అంతలా కష్టపడినా సదరం శిబిరంలో వివరాలు నమోదు చేయించలేకపోయారు. 

అడుగడుగునా నిర్లక్ష్యం
దివ్యాంగులు, వివిధ రోగాలతో బాధపడుతున్న వారు సదరం శిబిరానికి వేలాదిగా తరలివస్తారని తెలిసినా...ఆస్పతి యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. సెక్యూరిటీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో కంట్రోల్‌ చేయడానికి వీలుకాలేదు. సర్టిఫికెట్ల కోసం రోగులు తోపులాడుకునే పరిస్థితి ఎదురైంది. తమనంటే తమను ముందు పరీక్షించాలంటూ శిబిరానికి వచ్చిన వారు ఎగబాకారు. ఈ పరిస్థితుల్లో ఔట్‌పోస్టు ఏఎస్‌ఐ త్రిలోక్‌ టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించగా, వారు స్పెషల్‌పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. వారొచ్చిన గంటన్నరకు సమస్య సద్దుమణిగింది. 

క్షేత్రస్థాయిలో విఫలం
దివ్యాంగులను ఆస్పత్రికి పంపే విషయంలో క్షేత్రస్థాయిలో పీహెచ్‌సీ వైద్యులు, తదితర సిబ్బంది విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రతి బుధవారం సర్టిఫికెట్ల మంజూరు చేస్తారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఆస్పత్రి యాజమాన్యం, ఆరోగ్యశాఖ, సచివాలయ ఉద్యోగులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ. 9 రకాల సమస్యలతో బాధపడేవారితో పాటు సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే వారు ఆస్పత్రికి రావడం పెద్ద సమస్యగా మారింది.

మరిన్ని వార్తలు