జీజీహెచ్‌ అభివృద్ధి కమిటీ సభ్యుడి వీరంగం

15 Mar, 2018 10:51 IST|Sakshi
ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదం చేస్తున్న మెగరాల సురేష్‌

ఆస్పత్రి ఉద్యోగుల నిరసన

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

జీజీహెచ్‌లో గందరగోళం

నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై అభివృద్ధి కమిటీ సభ్యుడు బుధవారం వీరంగం సృష్టించాడు. క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు నిరసనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి చైర్మన్, పోలీసులు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పించడంతో వివాదం సమసింది. వివరాలు...జీజీహెచ్‌లో బుధవారం జరిగిన సెమినార్‌ హాల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు మొగరాల సురేష్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో శానిటేషన్‌ బాగాలేదని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, తనకు తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతున్నాయని సూపరింటెండెంట్‌ రాధాకృష్ణరాజుపై విరుచుకుపడ్డారు. తాను ఏమి చెప్పినా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. తాను ఆస్పత్రికి వచ్చినప్పుడు కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా లేదని, చెట్లు, మెట్ల వద్ద ఉండాలా అని మండిపడ్డారు. కమిటీ సభ్యుడిగా కాకపోయినా కనీసం జాతీయ పార్టీ జిల్లా నాయకుడిగా కూడా గౌరవించరా అంటూ ప్రశ్నించారు.

అందుకు సూపరింటెండెంట్‌ పార్టీ పరంగా ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన మొగరాల తమ పార్టీనే విమర్శిస్తావాని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇరువురి నడుమ మాటమాట పెరిగిపోతుండగా వైద్యాధికారులు, ఆస్పత్రి చైర్మన్‌ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఉద్యోగులు, వైద్యులు సెమినార్‌ హాల్‌ ప్రారంభోత్సవం అనంతరం మూకుమ్మడిగా ఆస్పత్రి చైర్మన్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఆస్పత్రి చైర్మన్‌ ఛాంబర్‌లో ఉన్న మొగరాలపై ధ్వజమెత్తారు. సూపరింటెండెంట్‌ను పళ్లు రాలగొడతావా, వెంటనే క్షమాపణ చెప్పి కమిటీ సభ్యుడిగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో  పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆస్పత్రి కమిటీ చైర్మన్‌ చాట్ల నరసింహారావు స్పందిస్తూ కమిటీ చైర్మన్‌గా తాను సూపరింటెండెంట్‌కు క్షమాపణ చెబుతున్నానన్నా ఉద్యోగులు ఒప్పుకోలేదు. అనుచితంగా మాట్లాడిన వారే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. సూపరింటెండెంట్‌ తనకు జరిగిన అవమానాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని, వారే చర్యలు తీసుకుంటారని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వివాదం ఆపకపోతే చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందని గ్రహించిన  ఆస్పత్రి చైర్మన్, పోలీసులు చర్చలు జరిపి మొగరాలతో క్షమాపణ చెప్పించారు. సూపరింటెండెంట్‌ చేతులతోనే ఫిర్యాదుని చించివేయించారు. దీంతో  మూడు గంటల పాటు నెలకొన్న గందరగోళానికి తెరపడింది.

మరిన్ని వార్తలు