పుస్తక పఠనంలో రామలింగరాజు

18 Apr, 2015 00:13 IST|Sakshi
పుస్తక పఠనంలో రామలింగరాజు

రోజుకు 10-15 గంటల పాటు వాటితోనే కాలక్షేపం
సాధారణ ఖైదీలానే దినచర్య
సోమవారం పని కేటాయించే  అవకాశం..

 
హైదరాబాద్: ‘సత్యం’ కుంభకోణం కేసులో ఏడేళ్ల శిక్షఖారారై చర్లపల్లి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రామలింగరాజు  అధికసమయం పుస్తక పఠనంతో గడిపేందుకే ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఆయన రోజుకు 10-15 గంటల పాటుగా రీడింగ్ రూంలో ఉంటూ పుస్తక పఠనం చేస్తున్నారు. ఎక్కువగా బయోలజీ, కెమిస్ట్రీ, సైన్స్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జైలులో ఆయన ఎవరితోను మాట్లాడటం లేదని, ఏకాంతంగా ఉండేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించడం లేదు. అందరిలానే అల్పాహారం, భోజనాన్నే ఆయనా తీసుకుంటున్నారు. అయితే ఇతర ఖైదీల మాదిరిగా ఇంకా ఆయనకు నిబంధనల మేరకు ప్రత్యేక పని అప్పగించలేదు. సోమవారం నుంచీ రామలింగరాజు సోదరులతో సహా మిగతా వారికి కూడా అధికారులు పనిని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

రాజుకు  జైలులో పాఠశాల, లైబ్రరీ, కంప్యూటర్ తరగతుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించే దిశగా  జైల్ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. రామలింగరాజు మాత్రం లైబ్రరీ ఇన్‌చార్జీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. రామలింగరాజు ఇప్పటికే మూడేళ్ల జైలు జీవితం గడిపినందున ప్రస్తుత శిక్షా కాలంలో అది మినహాయిస్తే ఓ నాలుగేళ్లు జైలులో ఉండే అవకాశాలుంటాయని, ఇక సత్ప్రవర్తనతో ఉంటే అది మూడేళ్లకే శిక్షాకాలం పూర్తికావచ్చని జైలు అధికారులు అంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు