ఆరు నెలల్లో నెరవేర్చకుంటే ఆమరణదీక్ష

5 May, 2015 23:29 IST|Sakshi

అన్నవరం (తూర్పు గోదావరి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం.. ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేర్చి, కాపుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంక టేశ్వరరావు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మంగళవారం జరిగిన కాపునాడు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీలలో ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు.


అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ డిమాండ్ నెరవేర్చలేదన్నారు. అలాగే, కాపుల సంక్షేమం కోసం ఏడాదికి రూ.1,000 కోట్లు ఇస్తానన్న చంద్రబాబు కేవలం రూ.100 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారని, అందులో రూ.50 కోట్లు విడుదల చేశారన్నారు. ఇది కూడా తమను మోసం చేయడమేనని విమర్శించారు. ఈ రెండు డిమాండ్లు ఆరు నెలల్లో నెరవేర్చకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు ప్రధానకార్యదర్శి ప్రగడ సుబ్బారావు, కార్యదర్శి తోటకూర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు