శత్రు‘చెర’ వీడి..!

12 Mar, 2014 03:29 IST|Sakshi
తాను ఏం చేసినా.. ఏం చెప్పినా.. అనుచరగణం జీ హుజూర్.. అంటారన్న బోల్డంత నమ్మకంతో రాజుగారు తెరవెనుక ఏర్పాట్లు చేసేసుకున్నారు. టీడీపీ నాయకత్వంతో ఒప్పందం కుదుర్చుకొని.. తన వర్గాన్నంతటినీ అందులో కలిపేయాలని నిర్ణయించేసుకున్నారు. ఆనక తీరిగ్గా.. కార్యకర్తల నిర్ణయం కోసమంటూ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మూడు దశాబ్దాలుగా టీడీపీతో పోరాడుతున్న తమను ఆ పార్టీకే తాకట్టు పెట్టడాన్ని సహించలే కపోయిన నేతలు ఎదురుతిరిగారు. పచ్చ చొక్క వేసుకోలేమని.. తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పారు. మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించి శత్రుచర్లకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు.
 
పాతపట్నం, న్యూస్‌లైన్: ‘టీడీపీలో చేరాలన్న మీ నిర్ణయం మాకు సమ్మతం కాదు.. అలా అయితే మా దారి మేం చేసుకుం టాం’.. అని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఆయన ప్రధాన అనుచరగణం తేల్చిచెప్పింది. దీంతో భారీ అనుచరగణంతో టీడీపీలో చేరాలన్న శత్రుచర్లకు శృంగభంగం ఎదురైంది. పాతపట్నం నియోజకవర్గంలో ఐదేళ్లుగా తనతో కలసి పనిచేసిన నేతలు, కార్యకర్తలతో ఆయన ఒడిశాలోని పర్లాకిమిడిలో మం గళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే శత్రుచర్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రధాన అనుచరుడు, మెళియాపుట్టి మాజీ ఎంపీపీ సలాన మోహనరావు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆరు నూరైనా తాము టీడీపీలో చేరేదిలేదని తేల్చిచెప్పారు. టీడీపీకి తామంతా వ్యతిరేకమని తేల్చిచెబుతూ సలాన మోహనరావుతోపాటు మెళియాపుట్టి మండలానికి చెందిన 24 మంది సర్పంచులు, ఇతర ముఖ్యనేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు సమావేశాన్ని బహిష్కరించారు. వారంతా ‘జైజగన్... జై వైఎస్సార్ కాంగ్రెస్’ అని నినాదాలు చేసుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో చేరాలన్న శత్రుచర్ల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సలాన మోహనరావు తనయుడు వినోద్ కుమార్ ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు. 
 
ముగిసిన తంతు
సలాన వర్గం దెబ్బతో శత్రుచర్ల కంగుతిన్నారు. దాంతో సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించేశారు. కేవలం కొంతమందితో మాట్లాడించేసి మమ.. అనిపించారు. కొందరు సర్పంచులు మాట్లాడుతూ తాము రెండు రోజుల తరువాత నిర్ణయాన్ని చెబుతామని చెప్పి జారుకున్నారు. కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో నేతలు మాత్రమే శత్రుచర్ల వెన్నంటి ఉంటామన్నారు. పాతపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు మిర్యబెల్లి శ్యాం సుందరరావు మాట్లాడుతూ తనకు రెండేళ్ల తరువాత లభించే అవకాశమున్న డీసీసీబీ  చైర్మన్ పదవినైనా వదులుకుంటాను గానీ శత్రుచర్లను మాత్రం వదులుకోలేనన్నారు.
 
వీలైతే టీడీపీలోకి..లేదా రాజకీయ సన్యాసం: శత్రుచర్ల 
చివరగా శత్రుచర్ల మాట్లాడుతూ వీలైతే టీడీపీలో చేరుతానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. సోనియా గాంధీ చేసిన రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ మరో 20 ఏళ్లు కోలుకోలేదన్నారు. సోనియా చుట్టూ ఉన్న భజనపరులైన నాయకులే ఈ దుస్థితికి కారణమన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. టీడీపీలో చేరాలని కొందరు తనకు సూచించారన్నారు. రాజకీయాల్లో కొనసాగితే టీడీపీలో చేరుతానన్నారు. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఈ సమావేశంలో పాతపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు మిర్యబెల్లి శ్యాంసుందరరావు, పాతపట్నం  ఏఎమ్‌సీ చైర్మన్ లింగాల జనార్ధన, కొత్తూరు ఏఎమ్‌సీ చైర్మన్ గోగుల చల్లంనాయు డు, ఎల్‌ఎన్‌పేట  జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివాల తేజేశ్వరరావు, కొత్తూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు అగతముడి బైరాగి నాయుడు, హిరమండ లం ముఖ్య నాయకులు అందవరపు రమేష్, సురేష్, పాతపట్నం ఎంపీపీ మాజీ అధ్యక్షుడు నూర్తి దాల య్య, ఇతర నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు