అయేషా హత్య కేసు : సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు

18 Jan, 2019 20:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తన తల్లిని, చెల్లిని చంపుతామని పోలీసులు బెదిరించడంతోనే నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసులో తాను నేరం ఒప్పుకోవాల్సి వచ్చిందని సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ ముందు హాజరైన సత్యంబాబు అనంతరం మీడియాతో మాట్లాడాడు. తాను నేరం అంగీకరించకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని పోలీసులు బెదిరించారని తెలిపాడు. నిర్భయ కేసులో ఏ విధంగా న్యాయం జరిగిందో అదే విధంగా ఆయేషా హత్య కేసులో కూడా న్యాయం జరగాలని, దీనికోసం సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. ఈ రోజు విచారణలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని పేర్కొన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ హత్య కేసు విచారణ చేపట్టిన సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం సత్యంబాబుతో పాటు ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను విచారించింది. 

అసలేం జరిగిందంటే..
కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్‌ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. 

మరిన్ని వార్తలు