నేడు సేవ్ డెమొక్రసీ

23 Apr, 2016 01:49 IST|Sakshi
నేడు సేవ్ డెమొక్రసీ

గుంటూరులో సాయంత్రం 5 గంటలకు  భారీ ర్యాలీ ప్రారంభం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం  వద్ద నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన
వైఎస్సార్ సీపీ శ్రేణులు  ప్రజాస్వామ్య వాదులు తరలిరావాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు



పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నందుకు నిరసనగా ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ  సాయంత్రం ఐదు గంటలకు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయం నుంచి లాడ్జిసెంటర్ చేరుకుని  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. వైఎస్సార్ సీపీ  జిల్లా కార్యవర్గం, జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మండల, పట్టణ, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ విభాగాల నేతలు తప్పని సరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.


బాబుది నీచ రాజకీయం..
ముఖ్యమంత్రి  చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీచ రాజకీయాలకు నాంది పలుకుతున్నారని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబు దోచుకున్న అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఏ మాత్రం దమ్మున్నా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు సిద్ధం కావాలని మర్రి రాజశేఖర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగబద్ధులు పోరాటానికి సిధ్దం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు