పెట్రో మంటకు రాష్ట్రాలే చెక్‌ పెట్టొచ్చు!

1 Jun, 2018 02:31 IST|Sakshi

నష్టం లేకుండానే ధర తగ్గించవచ్చన్న ఎస్‌బీఐ ఎకనామిక్‌ రీసెర్చ్‌

పెరిగిన ధరలతో రాష్ట్రాలకు రూ.18,729 కోట్ల అదనపు ఆదాయం

అది వదులుకుంటే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని సూచన

పెట్రోల్, డీజిల్‌లపై రెండు రూపాయల చొప్పున తగ్గించేందుకు అవకాశం

తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌

సాక్షి, అమరావతి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఎటువంటి అదనపు ఆర్థిక నష్టం లేకుండానే.. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించవచ్చని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎకనామిక్‌ రీసెర్చ్‌ నివేదిక స్పష్టం చేసింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.65, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గించినా.. రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాల్లో ఎటువంటి మార్పులు జరగవని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంత తక్కువ ఆదాయ నష్టంతో పెట్రోల్, డీజిల్‌ ధరలను ఏ విధంగా తగ్గించవచ్చన్నదానిపై ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ నేతృత్వంలోని కమిటీ నివేదికను విడుదల చేసింది. దేశంలో 93 శాతం ఇంధనం వినియోగిస్తున్న 19 రాష్ట్రాల ఆదాయాలు, అక్కడ అమల్లో ఉన్న పన్నులను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది.

పెరిగిన ధరలతో అదనపు ఆదాయం
ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరలను లెక్కలోకి తీసుకుంటే 2018–19 బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆదాయం కంటే ఈ 19 రాష్ట్రాలు అదనంగా రూ.18,729 కోట్లు ఆదాయం పొందుతున్నాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. బడ్జెట్‌ అంచనాలు రూపొందించాక.. పెట్రోల్, డీజిల్‌ల ధరలు పెరగడం, ఆ మేరకు వాటిపై పన్నుల ఆదాయం పెరగడమే దీనికి కారణం.

ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.65, డీజిల్‌పై రూ.2 వరకు ధరలు తగ్గించినా.. ఆయా రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్న మేరకు ఆదాయం సమకూరుతుందని కమిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. అంటే పెట్రోల్, డీజిల్‌ల ధరలు పెరిగినకొద్దీ.. వాటిపై పన్ను శాతం మేరకు వచ్చే ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఈ పెరిగిన ఆదాయం మేర పన్ను తగ్గించుకుంటే.. రాష్ట్రంలో ఆ మేరకు పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.


పన్నుపై మరో పన్ను వద్దు..
ప్రస్తుతం రిఫైనరీ నుంచి వచ్చిన పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రం నేరుగా పన్ను వేస్తోంది. దాంతో వాటి ధరలు పెరుగుతున్నాయి. అనంతరం రాష్ట్రాలు కూడా ఈ మొత్తం ధరపై మళ్లీ పన్ను వేస్తున్నాయి. అంటే పెట్రోల్, డీజిల్‌ల మూలధరతోపాటు కేంద్రం వేసిన పన్ను మొత్తంపైనా మళ్లీ పన్ను పడుతోందన్నమాట. ఇలా కాకుండా రాష్ట్రాలు కూడా మూలధరపైనే పన్ను వేసేలా విధానాన్ని రూపొందిస్తే.. పెట్రోల, డీజిల్‌ల ధరలు దిగివస్తాయని ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. 

తగ్గింపు దిశగా పలు రాష్ట్రాల దృష్టి..
పెట్రోల్, డీజిల్‌ ధరలు బాగా పెరిగిపోవడంతో.. తగ్గించే మార్గంపై పలు రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పెట్రోల్‌ ధరను రూపాయి మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కూడా. మిగతా రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా