మాయాజాలం

6 May, 2018 10:30 IST|Sakshi
ఇతర జిల్లాల నుంచి వచ్చిన వరికోత యంత్రంతో మాసూళ్లు చేస్తున్న దృశ్యం

మాయమవుతున్న సబ్సిడీ వరికోత యంత్రాలు

సబ్సిడీని దిగమింగి యంత్రాన్ని అమ్మేస్తున్న వైనం

నెరవేరని ప్రభుత్వ ధ్యేయం ∙పట్టించుకోని యంత్రాంగం

భీమవరం : వరి సాగులో ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ విధానం అమలు చేస్తూ సబ్సిడీపై ఇస్తున్న వరి కోత యంత్రాలను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుని రైతుమిత్ర బృందాలు దిగమింగుతున్నాయి. దీంతో రైతులకు యంత్రాలు అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యంత్రాలకు అధికమొత్తం చెల్లించి మాసూళ్లు పూర్తి చేసుకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయం, అధికారుల ముడుపులు, లబ్ధిదారుల అత్యాశ కారణంగా రైతులకు మేలు చేయాల్సిన యాంత్రీకరణ వ్యవహారం నిరుపయోగంగా మారుతోంది. ఇప్పటికే సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో రైస్‌మిల్లర్లు, రొయ్యలు, చేపలు చెరువుల యజమానులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చోటు లభించగా ప్రస్తుతం డెల్టా ప్రాంతంలో  దాళ్వా వరికోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వరికోత యంత్రాలు మాయం కావడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా వరిసాగులో ప్రకృతి వైపరీత్యాలు రైతులను అతలాకుతలం చేయడం, గిట్టుబాటు ధరలేకపోవడం, సాగుఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో జిల్లాలోని ఎక్కువమంది భూస్వాములు తమ పంట భూములను కౌలుకు ఇస్తుండగా మరికొంతమంది సారవంతమైన పంట భూములను రొయ్యలు, చేపలు చెరువులుగా మార్పు చేస్తున్నారు.

పెరిగిన కౌలు రైతుల సంఖ్య
జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగుచేయాల్సి ఉండగా అత్యధికంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇవ్వడంతో జిల్లాలో దాదాపు మూడు లక్షలకు పైగా కౌలు రైతులే వరి సాగు చేస్తున్నారు. కౌలుదారులు తమ కుటుంబం మొత్తం సాగులో లీనమైనప్పటికీ ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పెట్టుబడులు పెరిగి నష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం సాగును యాంత్రీకరణ బాట పట్టిస్తే ఖర్చులు తగ్గి రైతులకు ప్రయోజనం కలుగుతుందని అనేక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే  రైతులకు పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేయడానికి స్పేయర్లు, టార్పలిన్లు, జింకు సల్ఫేట్, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మాసూళ్లు సమయంలో వాతావరణం భయపెట్టడంతో  రైతులు ఎక్కువగా వరి కోతయంత్రాలపైనే ఆధారపడుతున్నారు.

లబ్ధిదారుల ఎంపికలో మాయాజాలం
ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యంత్రపరికాల పంపిణీలో అధికారులు లబ్ధిదారుల ఎంపికలో మాయాజాలం సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరిసాగు చేసేది ఎక్కువగా కౌలు రైతులే అయినప్పటికీ సబ్సిడీ మాత్రం భూస్వాములు దక్కించుకుంటున్నారు. గతేడాది రూ.రెండు లక్షల సబ్సిడీతో పంపిణీ చేసిన ట్రాక్టర్లు ఎక్కువగా రైస్‌మిల్లర్లు, రొయ్యలు, చేపల చెరువుల యజమానులు, కొంతమంది ప్రజాప్రతినిధులు దక్కించుకున్న వైనం తెలిసింది.

మరిన్ని వార్తలు