వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన ఎస్సీ, బీసీ కమిషన్‌ సభ్యులు

27 Jul, 2019 12:50 IST|Sakshi
బీజేపీ నాయకురాలు ఇచ్చిన స్థలంలో గుడిసె నిర్మించుకుంటే కూల్చేశారని కమిషన్‌ సభ్యులకు చెబుతున్న బాధితులు

మూడు వర్గాల ప్రజల వాదనలను ఆలకించిన ఎస్సీ, బీసీ కమిషన్‌ సభ్యులు

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేలా పేదలకు అవకాశం కల్పించాలి

పేదలను మోసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి

సాక్షి, కావలి: నెల రోజులుగా కావలి పట్టణంలో గుడిసెలు కూల్చివేత వివాదాన్ని పరీశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు కె.రాములు, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు ఆచార్య తల్లోజు శుక్రవారం కావలి పట్టణానికి వచ్చి, స్థానిక బాలకృష్ణారెడ్డినగర్‌ పక్కన ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అప్పటికే అక్కడ ఉన్న మూడు వర్గాల వాదనలను రెండు జాతీయ  కమిషన్‌ సభ్యులు ఉమ్మడిగా విన్నారు. బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి ఇచ్చిన స్థలాల్లో గుడిసెలు నిర్మించుకుంటే వాటిని కూల్చేశారని ఒక వర్గానికి చెందిన బాధితులు కమిషన్‌ సభ్యులకు తెలిపారు. రెండో వర్గం బాధితులు మాట్లాడుతూ బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి తమ వద్ద వేలాది రూపాయాలు తీసుకుని, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలకు నకిలీ పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆమెవల్ల నిండా మునిగి పోయామని కన్నీటిపర్యంతమయ్యారు.

మూడో వర్గానికి చెందిన స్థలం యజమానులు తాము పైసా పైసా కూడబెట్టి పిల్లల భవిష్యత్‌కు అండగా ఉంటుందని ఆశతో ప్లాట్లను కొనుగోలు చేశామని కమిషన్‌ సభ్యులకు చెప్పారు. ముగ్గురి వాదనలను ఆలకించిన జాతీయ కమిషన్‌ సభ్యులు ప్రైవేట్‌ వ్యక్తుల స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లోనే అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఇంత వరకు వచ్చిందన్నారు. ఇళ్లు కూల్చేయడంతో నిరాశ్రయులైన పేదలకు మూడు నెలలకు సరిపడే నిత్యాసరవర సరుకులు వెంటనే అందజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇళ్లు కూల్చేయడంతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వ భూమిని గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

అలాగే ఆ స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పేదలకు తాత్కాలికంగా నీడ కల్పించాలన్నారు. పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తుల చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కావలి డీఎస్పీని ఆదేశించారు. కార్యక్రమంలో కావలి సబ్‌ కలెక్టర్‌ చామకూరి శ్రీధర్, బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ, ఆర్‌.డేవిడ్‌ విల్సన్, జి.భరత్‌కుమార్, సి.వి.సి.సి.సత్యం, మాల్యాద్రి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు