మీ కాళ్లు పట్టుకుంటాం.. ఓటు కల్పించండయ్యా

23 Jan, 2019 13:19 IST|Sakshi

ఎస్సీ కమిషన్‌ సభ్యుడు శ్రీరాములు వద్ద వాపోయిన దళితులు

సీఎం సొంత జిల్లాలో ఇంత దారుణమా: శ్రీరాములు

రామచంద్రాపురం: మీ కాళ్లు పట్టుకుంటాం, మీకు దణ్ణం పెడుతామంటూ దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు శ్రీరాములు ముందు బోరున విలపించారు. ముప్పై ఏళ్లుగా మా ఓట్లు అగ్రవర్ణాల వారే వేసుకుంటున్నారని వాపోయారు. రామచంద్రాపురం మండలానికి చెందిన ఆరు గ్రామాల దళితవాడల ప్రజలు తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం శ్రీరాములు రెవెన్యూ, పోలీసు అధికారులను వెంటబెట్టుకుని వచ్చి గెరికచేనుపల్లి, బ్రాహ్మణకాల్వ దళితవాడల ప్రజలను కలిశారు. గెరికచేనుపల్లిలో కమ్మకండ్రిగ, రావిళ్లవారిపల్లి, కొత్తకండ్రిగ, గణేశ్వరపురం, కమ్మపల్లి, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, టీటీకండ్రిగ, పారకాల్వ పోలింగ్‌బూత్‌లలో ఓట్లు వేసుకోలేకపోతున్నామని దళితులు ఆయన దృష్టికి తెచ్చారు.

అగ్రవర్ణాల వారు తమ పంచాయతీకి తాగునీటిని నిలిపివేశారని, శ్మశానానికి కూడా నోచుకోక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  3 కిలోమీటర్ల దూరం నడిచి రావిళ్లవారిపల్లికి వెళ్లినా వేలుపై ఇంకుముద్ర వేసి పంపిస్తున్నారే కానీ ఓట్లు వేయనీయడం లేదని బ్రాహ్మణకాల్వ గ్రామస్తులు వాపోయారు. 11.42 సెంట్ల భూమిని అగ్రవర్ణాల వారు ఆక్రమించుకుని గుడి కట్టనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. శ్రీరాములు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమా అంటూ విస్తుపోయారు. దళితులను ఓటు వినియోగించకుండా అగ్రవర్ణాలు ఆపుతుంటే పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. ఓటు వేయనీయట్లేదంటే గ్రామ బహిష్కరణ చేసినట్లేనన్నారు. బాధితులకు తక్షణమే ఓటు హక్కు కల్పించాలని కోరారు. జేసీ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ బ్రాహ్మణకాల్వలో పోలింగ్‌బూత్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీరాములు వెంట ఆర్డీవో మల్లికార్జున, ఎమ్మార్వో జయరాములు, తదితరులు ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు