ఎస్సీ రుణాలకు ఆన్‌లైన్ కష్టాలు

19 Nov, 2014 03:36 IST|Sakshi

గుడివాడ టౌన్ :  దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందజేస్తున్న ఎస్సీ రుణాల పంపిణీ వ్యవహారం దరఖాస్తు చేసుకోదలచిన అర్హులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. రుణాలకు సంబంధించిన దరఖాస్తులను అర్హులు పూర్తిచేసి పీఓ కార్యాలయంలో ఇవ్వడానికి అలవాటుపడ్డారు. రుణాల కోసం ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ముందుగా కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలను మీ-సేవ ద్వారా పొందాలి. అనంతరం వాటిని తిరిగి మీ-సేవ లేదా ఇంటర్నెట్ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదుచేసి దరఖాస్తు అంగీకరించినట్లు రశీదు పొందాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేమి, ఈ విధానాన్ని అర్థం చేసుకోలేని తాము రుణాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోగలమని అర్హులు ప్రశ్నిస్తున్నారు.
 
అందుబాటులో లేని రెవెన్యూ అధికారులు
తొలుత ధృవీకరణ పత్రాల కోసం అర్హులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోంది. రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా బ్యాంకులు రెవెన్యూ కార్యాలయానికి భారీసంఖ్యలో ఉన్న లబ్ధిదారుల జాబితాలను పంపాయి. వాటికి సంబంధించిన ఆధార్, రేషన్‌కార్డుల వివరాల సేకరణలో రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేయడానికి వారు అందుబాటులో ఉండటం లేదు. దీంతో దరఖాస్తుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 చివరిరోజు కావడంతో ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సేవలు అందించలేని ‘మీ-సేవ’లు
పట్టణంలో మీ-సేవ కేంద్రాలు మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని సిబ్బంది కరెంటు బిల్లులు, డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల, మున్సిపల్ ట్యాక్సులు వంటివి కట్టించుకోవడంతో పాటు ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా చూడాల్సి వస్తోంది. ఇన్ని అవసరాలకు సరిపడా కంప్యూటర్లు, సిబ్బంది లేకపోవడంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకోదలచినవారికి అందించాల్సిన సేవల గురించి పట్టించుకునేవారే లేరు. ఒక్కో మీ-సేవ కేంద్రంలో ఒక్క స్కానర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఐదు నుండి 10 రకాల పత్రాలు ఇక్కడ స్కాన్‌చేసి జత చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో రోజుకు ఒక్కో మీ-సేవ కేంద్రంలో 100 దరఖాస్తులు కూడా పూర్తికావడం లేదు. మధ్యలో ఈ నెల 23న ఆదివారం కావడంతో ఒకరోజు వృథా అవుతుందని, ఎప్పటికి తమ దరఖాస్తులు పూర్తవుతాయోనని అర్హులు తలలు పట్టుకుంటున్నారు.
 
దళారుల ప్రభావం...
ఇదిలా ఉండగా రుణానికి సంబంధించి అన్నీ మేమే చూసుకుంటామని కొందరు దళారులు తమను ప్రలోభపెట్టి సొమ్ము చేసుకుంటున్నారని దరఖాస్తు చేసుకోదలచిన అర్హులు ఆరోపిస్తున్నారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు వారే తెచ్చి దరఖాస్తు పూర్తిచేస్తే ఒకరేటు, సర్టిఫికెట్లు తెచ్చుకుంటే కేవలం దరఖాస్తు చేయడానికి మరో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని, అమాయకులు వీరి వలలో చిక్కుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా పైరవీ చేసేవారిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు