ఆగని మృత్యుగీతం

18 Mar, 2017 17:58 IST|Sakshi

ఏజెన్సీ ఆశ్రమ వసతిగృహాల్లో గిరిజన విద్యార్థుల మరణాలు ఆగటం లేదు. ఆదివాసీ చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏడాదిలో 23 మంది రక్తహీనత, పచ్చకామెర్లు, మలేరియా, డయేరియా లక్షణాలతో చనిపోయారు. ఒక్క మార్చి నెలలో రెండు వారాల వ్యవధిలో ఏకంగా ఎనిమిది మంది మరణించారు. పరిస్థితి చేయిదాటిపోతున్నా..ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్ట లేదు. వ్యాధుల కాలం కార్యాచరణను అమలు చేయకపోవడం, ఆశ్రమాలు, గురుకులాల్లో పిన్‌పాయింట్‌ ప్రోగ్రాం లేకపోవడం ఇందుకు కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
► ఆశ్రమాలు, హాస్టళ్లలో అనారోగ్యంతో రాలిపోతున్న చిన్నారులు
► తాజాగా రక్తహీనతతో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి
► నియంత్రణ చర్యలు చేపట్టని ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖ

పాడేరు/డుంబ్రిగుడ: మరో పసిమొగ్గ రాలిపోయింది. డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలలో గురువారం ఓ విద్యార్థి అనారోగ్యంతో చనిపోయిన సంఘటనను మరిచిపోక ముందే ఇదే మండలం జాముగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న  విద్యార్థిని శెట్టిఅశ్విని రక్తహీనతతో బాధపడుతూ అరకులోయ ఏరియా ఆసుపత్రిలో గురువారం రాత్రి చనిపోయింది. ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో సంభవిస్తున్న గిరిజన విద్యార్థుల ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 15 ఏళ్లలోపు వీరు ఏటా మృత్యువాత పడుతున్నారు. చదువు కోసం పిన్నవయస్సులో తల్లిదండ్రుల ఆలనా, పాలనలకు దూరంగా ఆశ్రమాల్లో చేరుతున్న వీరికి సరైన పోషణ, సంరక్షణ కల్పించడంలో అలక్ష్యం చోటుచేసుకుంటోంది.

తమ అనారోగ్య సమస్యలను వారు వ్యక్తపరచలేకపోతున్నారు. అది విషమంగా పరిణమిస్తోంది.  గుర్తించి ఆస్పత్రిలో చేర్చేసరికి కాలాతీతమై పరిస్థితి చేయిదాటుతోంది. విద్యార్థుల ప్రాణాలు నిలవడం లేదు.15 రోజుల వ్యవధిలో 8 మంది విద్యార్థులు అనారోగ్య పరిస్థితుల వల్ల మృతి చెందారు. ఇలా ఏటా ఆశ్రమాల్లో విద్యార్థుల మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల బందవీధి ఆశ్రమ విద్యార్థిని జవ్వాది శైలజ, సూకూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థిని రేగం జానకి, అరడకోట ఆశ్రమ విద్యార్థి నాయుడు శివాజీ మృతి చెందారు.

ఇదే నెలలలో పెదబయలు గురుకుల విద్యార్థి హరిశ్చంద్ర ప్రసాద్, రింతాడ పాఠశాల విద్యార్థిని తలుపులమ్మ, చింతపల్లి పాఠశాలలో ఎన్‌.గీత, డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న మాదెల విష్ణువర్ధన్, జాముగూడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మృతి చెందారు.  పచ్చకామెర్లు, రక్తహీనత, జ్వరం వంటి అనారోగ్య పరిస్థితుల వల్ల వీరంతా చనిపోతున్నారు.
చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి: డీఎం హెచ్‌వో సరోజిని
డుంబ్రిగుడ: హాస్టల్‌ విద్యార్థుల ఆరోగ్య సమస్యల పట్ల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌వో సరోజిని ఆదేశించారు. డుంబ్రిగుడ బాలుర వసతిగృహంలో గురువారం విద్యార్థి మాదల విష్ణువర్ధన్, శుక్రవారం జాముగుడ పాఠశాల విద్యార్థిని శెట్టి అశ్విని మృతి చెందడంతో ఆమె శుక్రవారం డుంబ్రిగుడ వచ్చారు. విష్ణువర్ధన్‌ మృతికి కారణాలకు హెచ్‌ఎం విజయరావుతో పాటు ఆరోగ్యకార్యకర్త చిట్టిబాబును అడిగి తెలుసుకున్నారు. జాముగుడ బాలికల పాఠశాలకు వెళ్లి విద్యార్థిని అశ్విని మృతికి కారణాలను హెచ్‌ఎం మంగమ్మను అడిగి తెలుసుకున్నారు.

చిన్నారులు చిన్నపాటి అనారోగ్యానికి గురైనా సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు.  హాస్టళ్లలో పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీకి  వెళ్లి విద్యార్థులకు వైద్యసేవలపై ఆరా తీశారు. ఆమె వెంట వైద్యాధికారి శాంతికిరణ్‌ ఉన్నారు.
హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే రవిబాబు
పాడేరు: ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి విద్యార్థులందరికీ ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించాలని ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు నెలల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందారన్నారు. పౌష్టికాహారం, వైద్య, ఆరోగ్య సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హాస్టళ్లలోని గిరిజన విద్యార్థులకు అనుబంధ పోషకాహారం సరఫరా చేయాలన్నారు. రోజుకొకరు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. దీనికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. గిరిజన విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ఎస్వీ రమణ, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జంపరంగి ప్రసాద్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు