చేపా..చేపా..ఎందుకు రావడం లేదు!

14 Aug, 2013 15:08 IST|Sakshi
చేపా..చేపా..ఎందుకు రావడం లేదు!

‘చేపా..చేపా..ఎందుకు ఎండలేదు’ .. ఇది చిన్నప్పుడు కథలో చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం ‘చేపా..చేపా.. ఎందుకు రావట్లేదు' అని అడగాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు దాపురించిందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.  ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఎవరిని అడిగినా టక్కున చెపుతారు.  సీమాంధ్ర ఉద్యమ ప్రభావమేనని. సీమాంధ్ర ఉద్యమానికి, చేపకు సంబంధం ఏంటని మరి కొందరికి అనుమానం కలగక మానదు. దేశంలోని ప్రధాన నగరాలకు గోదావరి జిల్లాలనుంచే చేపల ఎగుమతి జరుగుతుందన్న విషయం అర్ధమైతే చాలు..పూర్తి పాఠం మనకు తెలిసిపోతుంది.

 

కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని భీమవరం, ఆకివీడు, కైకలూరు, అవనిగడ్డ, నాగాయలంక, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం తదితర ప్రాంతాల్లో చేపలు, రొయ్యల సాగు విస్తృతంగా సాగుతుంటుంది. ఈ ప్రాంతాల నుంచే దేశ విదేశాలతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి కూడా ఇవి ఎగుమతి అవుతుంటాయి. కానీ, గత కొంత కాలంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా సమ్మె జరుగుతుండటం, తాజాగా రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతో ఆ ప్రభావం రాజధాని హైదరాబాద్ సహా పలు తెలంగాణ జిల్లాల్లోని చేపల మార్కెట్లకు చేపలు, రొయ్యల రాక పూర్తిగా ఆగిపోయింది.

 

ప్రత్యేక రాష్ట్ర అంశం తెరమీదకు వచ్చిన తరుణంలో సీమాంధ్రలో చేపట్టిన ఉద్యమం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. సీమాంధ్రకు వెళ్లాల్సిన బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో జనం ఇక్కట్లు పడుతుండగా, ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల కూరగాయలు, చేపల రవాణాకు పూర్తిగా బ్రేక్ పడింది. దీంతో హైదరాబాద్ లోని చేపల మార్కెట్లన్నీ పూర్తిగా బోసిపోయాయి.

కూరగాయల సంగతి పెట్టినా.. మాంసాహారం లేకుండా ముద్ద దిగని భోజన ప్రియులకు మాత్రం నిరాశ తప్పట్లేదు. ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాంతాలతో పనిలేదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తిండి విషయంలో రాజీ పడని వారికి మాత్రం ఉద్యమ సెగ బాగానే బోధ పడుతుంది. చివరకు.. చేపకు రెక్కలు, మొప్పలు ఉన్నా తిందామనుకునే వాళ్లకు తిప్పలు మాత్రం తప్పడం లేదు.

మరిన్ని వార్తలు