పని చేయని ‘పథకం’

10 Sep, 2015 23:48 IST|Sakshi

 గుర్ల: అసలే వర్షా కాలం..ఆపై తాగు నీరు స్తంభించిందంటే గ్రామీణ ప్రజల అవస్థలు చెప్పనక్కర్లేదు. ఇదే పరిస్థితిన ఎదుర్కొంటున్నారు మండలంలోని ఎస్‌ఎస్‌ఆర్‌పేట, మణ్యపురిపేట, రాగోలు తదితర గ్రామాల ప్రజలతో పాటు నెల్లిమర్ల మండలంలోని గుషిణి, జోగిరాజుపేట తదితర 52 గ్రామాల ప్రజలు.  ఆయా గ్రామా లకు తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం రామతీర్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసింది. పథకం ఆరంభించినప్పటి నుంచి నిర్వహణ లోపం వెంటాడుతోంది. అయితే ఇటీవల పథకం తీరు మరీ అధ్వానంగా తయారైంది. ఈ పథకానికి సంబంధించిన పంపుహౌస్, మోటార్లు ఎస్‌ఎస్‌ఆర్‌పేట సమీపంలో ఉన్న చంపావతి నదిలో ఉన్నాయి. పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీరు పైపులైన్ల ద్వారా 52 గ్రామాలకు సరఫరా అవ్వాలి.
 
 అయితే వారం రోజుల క్రితం పంపుహౌస్‌లో ఉన్న మోటార్లు పనిచేయకపోవడంతో గ్రామాలకు తాగు నీరు సరఫరా కావడం లేదు. ఆయా గ్రామాల నుంచి తాగు నీరు అందడం లేదని ప్రతిరోజూ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో పాటు సంబంధిత నిర్వాహకులకు ఎన్ని ఫిర్యాదులిచ్చినా, ఫోన్లు చేసినా ప్రయోజనం లేకపోతోందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తరుచూ లో, హై ఓల్టేజీతో మోటార్లు  పాడవుతున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడం సాధారణమైపోయిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి కోసం గ్రామ సమీపంలో ఉన్న బావులను ఆశ్రయిస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో బావుల్లోని నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నట్లు పలువురు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  
 

మరిన్ని వార్తలు