గిరిజనం.. దా‘రుణం

4 Mar, 2014 02:22 IST|Sakshi

 కడప
 సాధారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగుల కార్పొరేషన్ వ్యక్తిగత బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి జూన్, జులైలో ప్రకటన వెలువడుతుంది. కాగా, 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా ఎస్టీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గడిచిన జనవరి రెండవ వారంలో రుణ లక్ష్యాలను కేటాయించింది.

దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గిరిజన వర్గాలు రుణాల దరఖాస్తులను పొందారు. 101 జీఓ నిబంధనల మేరకు దరఖాస్తును పూర్తి చేయడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు దాదాపుగా చాలా వరకు దరఖాస్తులను సమర్పించగలిగారు. అయితే, ప్రస్తుతం రుణాల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు.
 

660 మంది లబ్ధిదారులకు!

 జిల్లా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గిరిజన వర్గాలకు 194 యూనిట్లను 666 మందికి అందించాల్సి ఉంది. ఒక యూనిట్ విలువ 60 శాతం సబ్సిడీతో రూ. లక్ష, రూ. 3.50 లక్షలు, రూ. 8 లక్షల వరకు రుణాన్ని అర్హులకు అందించాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వం సబ్సిడీ కింద రూ. 1.34 కోట్లను మంజూరు చేయాలి. కాగా ప్రభుత్వం ఆలస్యంగా అంటే జనవరి 2వ వారంలో రుణ లక్ష్యాలను కేటాయించడంతో రుణాల ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ ఒక్కరికి కూడా రుణం అందని పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా మార్చిలోకి అడుగిడగానే దాదాపు 75 శాతం మందికి  పైగా రుణాలు అందాల్సి ఉంది. ప్రభుత్వం ఆలస్యంగా లక్ష్యాలను నిర్దేశించడంతో ఆ ప్రభావం రుణాలపై పడింది. అయితే, ఇంతవరకు సబ్సిడీ గురించి ప్రభుత్వం ఎలాంటి  ప్రకటన వెలువరించలేదు. ప్రభుత్వం సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తేనే బ్యాంకర్లు ఆ సబ్సిడీని కలుపుకుని తమవంతు వాటాగా సదరు వ్యక్తికి రుణాన్ని అందిస్తారు. సబ్సిడీ ఖాతాల్లో జమకాకపోతే రుణ మంజూరు ప్రసక్తి  ఉండదు. కాగా, 101 జీఓ కారణంగా సవాలక్ష ఆంక్షలను అధిగమించి దరఖాస్తులను పూర్తి చేయడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు సమస్యలను అధిగమించి 90 శాతంమందికి పైగా గిరిజన వర్గాలు రుణాల కోసం సంబంధిత శాఖలకు సమర్పించారు. ఆ దరఖాస్తుల పరిశీలన నిమిత్తం అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
 

 ఎన్నికల కోడ్‌తో గందరగోళం

 హైకోర్టు మన్సిపల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆదేశించడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద అడుగులు వేసింది.  సోమవారం ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రుణాల మంజూరు ముందుకు సాగుతుందా? నిలిచిపోతుందా? అనే సందిగ్ధం నెలకొంది
 

మరిన్ని వార్తలు