బంగారు తల్లికి కష్టకాలం

23 Jun, 2014 02:25 IST|Sakshi

ప్రొద్దుటూరు: గత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం ప్రస్తుతం ఆగిపోయింది. లబ్ధిదారుల ప్రోత్సాహకాలకు సంబంధించిన డబ్బు మంజూరు కాకపోవడంతో పథకం కొనసాగింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి చట్టం చేసినా ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో లబ్ధిపై సందేహాలు లేకపోలేదు. నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ ఆమోదంతో బాలికాభ్యుదయ, సాధికారిత చట్టాన్ని తెచ్చారు. గత ఏడాది మే నెల నుంచి ఈ పథకం అమలైంది. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపికైన వారికి పుట్టిన వెంటనే ప్రసవానికి రూ.2,500 చెల్లించడంతోపాటు తర్వాత వ్యాధి నిరోధక టీకాలు, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, కళాశాల, ఇలా వివిధ స్థాయిలలో 21వ సంవత్సరం వరకు ప్రతి ఏటా నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి రూ.50వేలు, డిగ్రీ పాస్ అయిన వారికి రూ.లక్ష, మొత్తం రూ.1,55,000 బాలికకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెల్లిస్తారు. గతంలో ఉన్న లక్‌పతి పథకం స్థానంలో ఈ పథకాన్ని అమలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆడపిల్లలు సంతానం కలవారు దరఖాస్తు చేసుకున్నారు.
 
 అయితే మొదట్లో వెంట వెంటనే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరయ్యాయి. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఈ పథకం కుంటినడక నడుస్తోంది. జిల్లాకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 8859 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా కేవలం 4,403 మందికి మాత్రమే ప్రోత్సాహకాలను చెల్లించారు. ఈ ప్రకారం జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో ఉంది. ప్రోత్సాహకాల చెల్లింపులో జాప్యం కావడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంపై డీఆర్‌డీఏ అడిషనల్ ప్రాజెక్టు డైరక్టర్ ఎం.నాగరాజును న్యూస్‌లైన్ వివరణ కోరగా ఎన్నికల కారణంగా ప్రోత్సాహకాల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు.
 
 చిన్నారిని ఎత్తుకున్న ఈమె పేరు దుర్గనబోయిన లక్ష్మీసునీత. ప్రొద్దుటూరు మండలం భగత్‌సింగ్ కాలనీకి చెందిన ఈమె గత ఏడాది జూన్ 7న అనితా లక్ష్మీకి జన్మనిచ్చింది. ఈమె కాన్పు కోసం పెండ్లిమర్రి మండలంలోని ఉలవలపల్లె గ్రామానికి వెళ్లింది. అది గ్రామం కావడంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమండలానికి వెళ్లగా ఓ నర్సు ఈమెకు పురుడు పోసింది. బంగారుతల్లి పథకం ముందు నెలలోనే ప్రారంభం కావడంతో ఎంతో ఆశగా ఈమె బిడ్డను ఎత్తుకుని కార్యాలయాల చుట్టు తిరిగి దరఖాస్తు చేసుకుంది.
 
 లక్ష్మీసునీత అత్తారిల్లు, పుట్టింటిలో కాకుండా మరో చోట పురుడు పోసుకుందని బంగారుతల్లి దరఖాస్తుపై ఎవ్వరు సంతకాలు చేయలేదు. నిబంధనల ప్రకారం ఏఎన్‌ఎం, డాక్టర్ సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఈమెకు వీరెవ్వరు సంతకాలు చేయకపోవడంతో సుమారు 3 నెలల పాటు ఈమె అధికారుల చుట్టు తిరిగి విసిగి వేసారి చివరికి ఆశలు వదులుకుంది. బంగారుతల్లి పథకానికి సంబంధించిన నిబంధనల కారణంగా పలు చోట్ల ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనికితోడు అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రోత్సాహక బహుమతుల మంజూరులో జాప్యం జరుగుతోంది.

>
మరిన్ని వార్తలు