ప్రతిభకు మహా కోత

5 Jun, 2015 02:56 IST|Sakshi
ప్రతిభకు మహా కోత

- విద్యశ్రీ పథకం కింద అర్హత పాయింట్ల పెంపు
- తక్కువ మందికి పరిమితమైన పథకం
- కలవరపడుతున్న పేద విద్యార్థులు
విశాఖపట్నం సిటీ :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన పేదింటి విద్యార్థులకిచ్చే ప్రోత్సాహానికి జీవీఎంసీ కోత విధిస్తోంది. కాసుల భారమంటూ ఈ పథకాన్ని కుదించేస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాఠశాలల్లో చదివిన విద్యార్ధులను ఉన్నత చదువులకు ప్రోత్సహించేందుకు విద్యశ్రీ పథకాన్ని అయిదేళ్ల క్రితం ప్రారంభించింది. ఇందుకోసం జీవీఎంసీలో ఓ ప్రత్యేక విభాగం వుంది. ఈ పథకంలో లబ్ధికి ఏటా వందలాది మంది విద్యార్ధులు ఎంపికవుతున్నారు.

వీరికి కార్పొరేట్ కాలేజీల్లో విద్యతో బాటు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నారు. దీంతో ప్రభు త్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావించి ఆ మేరకు నిర్ణయాన్ని అమలు చేస్తోంది. టెన్తులో 500మార్కులు దాటినవారు దీనికి అర్హత పొందేవారు. జీపీఎ విధానమొచ్చాక గతేడాది పదోతరగతిలో 7.5 గ్రేడ్ పాయిం ట్లు సాధించిన విద్యార్ధులను కార్పోరేట్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించారు. 327 మందికి రూ. 37 లక్షలు జీవీఎంసీ విద్యశ్రీ కింద చెల్లించింది.

అయితే అర్హుల సంఖ్య పెరిగిపోతోందని భావించిన జీవీఎంసీ ఇప్పుడు భారీగా కోత పెట్టేందుకు సమాయత్తమయ్యింది. 2015 ఫలితాల్లో 9 ప్లస్ గ్రేడ్ పాయింట్లు సాధించిన వారు మాత్రమే అర్హులని ప్రకటించేయడంతో పేద, మధ్య తరగతి విద్యార్దులంతా నిరాశకు గురయ్యారు. 9 ప్లస్ గ్రేడ్ పాయింట్లు అంటే జీవీఎంసీ పాఠశాలల్లో చదివే అతి కొద్ది మందికే సాధ్యం. చాలీచాలనీ కూలీతో పిల్లలను బడికి పంపడమే తమ కుటుంబాల్లో తక్కువని అలాంటి వారికి అన్ని గ్రేడ్ పాయింట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.

భీమిలి, అనకాపల్లితో కలిపి జీవీఎంసీ పరిధిలో 27 పాఠశాలల్లో చదివిన వారిలో 9 గ్రేడ్‌పాయింట్లకు పైగా మార్కులు సాధించిన వారు 50 మంది వరకూ ఉన్నారు. అందులో పాలిటెక్నిక్, ఐటీఐ వంటి కోర్సులకు పోయేవారు ఎక్కువగానే ఉంటారు. ఇంటర్‌మీడియట్ చదివే వారు అరుదుగా వుంటారని అందుకే కనీసం 8 గ్రేడ్‌పాయింట్ల కైనా అర్హత మార్కులను కుదించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు