కడుపు పండితే వేదన.. కన్ను తెరిస్తే యాతన

17 Jan, 2015 03:30 IST|Sakshi
కడుపు పండితే వేదన.. కన్ను తెరిస్తే యాతన

కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చతికిలపడింది. మాతా, శిశు మరణాల శాతం తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. ఎమ్మిగనూరు మండలంలో 11 నెలల్లో కాన్పు సమయంలో వంద మంది శిశువులు మృతి చెందగా.. 2013-14 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 25వేల కాన్పులు ఇళ్ల వద్ద జరగ్గా, కర్నూలు జిల్లాలోనే 11,599 నమోదవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం లోపించడం కూడా మాతా శిశు మరణాల సంఖ్య రాష్ట్రంలోనే జిల్లాను రికార్డు స్థానంలో నిలుపుతోంది. కర్నూలు డివిజన్‌లో 31, నంద్యాల డివిజన్‌లో 27, ఆదోని డివిజన్‌లో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. తగినంత సిబ్బంది పని చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రచార, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మాతా శిశు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం విమర్శలకు తావిస్తోంది.
 
ఏమి జరుగుతోంది..
జిల్లాలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ఆసుపత్రిలోనే కాన్పు జరిగేలా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంది. ఇంటి వద్ద కాన్పుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకుంటే కలిగే లాభాలు, పారితోషికం వివరాలను తెలియజెప్పాలి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో గర్భిణిలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అయితే గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు.

కౌతాళం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హొళగుంద హెల్త్ సూపర్‌వైజర్, పెద్దతుంబళం హెల్త్ ఆఫీసర్, అర్దగేరి హెల్త్ అసిస్టెంట్.. ఇలా అనేక మంది జిల్లా కేంద్రంలో పని చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటేషన్లకు అర్హత లేని కాంట్రాక్టు వైద్య సిబ్బంది జిల్లా పరిసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేయించుకున్నారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా గాడితప్పింది. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన ‘డెమో’ విభాగం ఉన్నా లేనట్లుగా మారింది.
 
ఆదోని డివిజన్‌లోనే అధికం
జిల్లాలోని ఆదోని డివిజన్‌లో మాతా శిశు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఆదోని డివిజన్ పరిధిలో(రూరల్) నెలలోపు శిశువులు 112 మంది, ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 24 మంది, గర్భిణిలు ముగ్గురు చొప్పున చనిపోయారు. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే శిశు మరణాల శాతం 26.88, సంవత్సరంలోపు పిల్లలు 1.03, మాతృ  మరణాలు 72.01 శాతం చొప్పున ఇక్కడే నమోదయ్యాయి. ఆదోని అర్బన్ ప్రాంతంలో నెలలోపు శిశువులు 105 మంది, ఐదేళ్లలోపు పిల్లలు 6 మంది, ఒక గర్భిణి మరణించారు. ఇక్కడ శిశు మరణాల శాతం అత్యధికంగా 42.97 శాతం, మాతృ  మరణాల శాతం 40.93గా ఉంది.
 
 మండలం             మృతి చెందిన         మరణించిన
                           నెలలోపు              గర్భిణిలు
                            శిశువులు
 ఆత్మకూరు             36                      04    
 ఆళ్లగడ్డ                  26                       01    
 కోడుమూరు          53                       03    
 ఎమ్మిగనూరు       100                     04    
 ఆలూరు               25                       02    
 కర్నూలు రూరల్    60                     02    
 కర్నూలు అర్బన్    42                      05    
 కోయిలకుంట్ల        37                      04

మరిన్ని వార్తలు