ఉపకారవేతనాల కుంభకోణంపై విచారణ

1 Jun, 2016 00:09 IST|Sakshi

సీతంపేట: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని కళాశాలల వసతిగృహాల్లో లేని విద్యార్థులను ఉన్నట్టు చూపి వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ నుంచి లక్షలాది రూపాయలు స్వాహా చేసిన సంఘటనపై మంగళవారం నుంచి విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి విద్యావిభాగం డిప్యూటీ డెరైక్టర్ సి.ఎ.మణికుమార్, జేఏవోలు సుదర్శన్, మాణిక్యాలరావు సీతంపేటలోని గిరిజన సంక్షేమ కార్యాలయానికి చేరుకుని ఇక్కడ ట్రైబుల్‌వెల్ఫేర్ డీడీ ఎంపీవీనాయిక్‌తో ఉపకారవేతనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
 
 రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, పాలకొండ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో ఈ అవినీతి చోటుచేసుకోవడంతో ఆ వసతిగృహాలతో పాటు పాతపట్నం, సీతంపేట పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల రికార్డులను పరిశీలించారు. విశేషమేమిటంటే అక్రమాలకు పాల్పడిన ఏటీడబ్ల్యూవో ఎర్రన్నాయుడు, వార్డెన్లు ఝాన్సీరాణి, వెంకటినాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ప్రస్తుత విచారణ రికార్డులకే  పరిమితమైంది.
 
 అక్రమాలపై క్షుణ్ణంగా విచారణ చేపడతాం
 శ్రీకాకుళం, పాలకొండ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నిజాలు నిగ్గుతేలుస్తామని డిప్యూటీ డెరైక్టర్ మణికుమార్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపకార వేతనాల్లో జరిగిన అక్రమాలపై ఐటీడీఏ పీవో ఫిర్యాదు చేశారన్నారు. అక్రమాలకు పాల్పడిన వారికి చార్జ్‌మెమోలు ఇస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం విచారణ చేస్తామన్నారు. రికార్డులు మాయం చేశారనే విలేకరుల ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ అన్ని రికార్డులు అందుబాటులో ఉన్నాయన్నారు.
 
  ఏ వ్యవహారం ఎప్పుడు జరిగిందనేది ఆన్‌లైన్‌లో నమోదు చేశారని పేర్కొన్నారు. ఎవరూ తప్పించుకోడానికి వీల్లేదన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి పూర్తి విచారణ చేస్తామన్నారు. నిష్ణాతులైన ఖాతా విభాగాల అధికారులు కూడా వచ్చారని వారు కూడా విచారణ చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎంపీవీ నాయిక్, సూపరింటెండెంట్ నీలకంఠం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు