బాలల దినోత్సవం రోజున విషాదం

15 Nov, 2017 11:51 IST|Sakshi

బాలల దినోత్సవం రోజున  విషాదం

స్కూలు వ్యాను కింద పడి బాలిక మృతి

తల్లడిల్లినతల్లిదండ్రులు

 దద్ధరిల్లిన బంధువుల రోదనలు

 దళవాయిపల్లెలో విషాదఛాయలు

అమ్మా.. ఈ రోజు మా స్కూల్లో పండుగ చేస్తారంట.. పిల్లలందరూ అందంగా రెడీ అవ్వాలంట.. నాకు కొత్త దుస్తులు వెయ్యి.. రోజాపూలు పెట్టు..’ అంటూ ఆ చిన్నారి చిట్టిపొట్టి మాటలతో తల్లిదండ్రులను మురిపించింది. తాను అనుకున్నట్టుగానే రెడీ అయ్యి.. స్కూలు వ్యాను ఎక్కి అమ్మకు టాటా చెప్పింది. సాయంత్రం పాఠశాలలో జరిగిన విశేషాలను ఆనందంతో మోసుకొచ్చింది. వాటిని తన తల్లికి తెలియజేయాలని ఉబలాటపడింది. స్కూలు వ్యాను దిగి ఆత్రుతగా ఇంటివైపు వెళ్తోంది. ఇంతలో వ్యాను వెనుకకు రావడం తో ఆ చక్రాల కిందే పడి నలిగిపోయింది. తలమొత్తం నుజ్జునుజ్జుయింది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధువుల రోదనలతో గ్రామం దద్ధరిల్లింది. ఈ ఘటన బాలల దినోత్సవం రోజైన మంగళవారం యాదమరి మండలంలో విషాదాన్ని నింపింది.

చిత్తూరు జిల్లా / యాదమరి: బాలల దినోత్సవం రోజున ఓ చిన్నారి స్కూలు వ్యాను కింద పడి నలిగిపోయిన ఘటన యాదమరి మండలం దళవాయిపల్లెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మణి, అరుణకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద పాప కుసుమ(6). ఇంగ్లిష్‌ చదువులు చదివించాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా చిత్తూరులోని ఓ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చేర్పించారు. 

మురిపించిన చిలుక పలుకలు
బాలల దినోత్సవం కావడంతో మంగళవారం స్కూలుకు వెళ్లడానికి కుసుమ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అమ్మ వద్ద చిలుకపలుకుతో అందంగా రెడీ చేయాలని సూచించింది. చాచా నెహ్రూ చిత్రపటం వద్ద పూలు పెట్టాలని రోజాలు కోసివ్వమని చెప్పింది. చిట్టితల్లి చెప్పినట్టుగానే తల్లి చిన్నారిని అందంగా రెడీ చేసింది. మధ్యాహ్నానికి క్యారియర్, పుస్తకాల బ్యాగ్‌ రెడీ చేసి, రోజాలు కోసిచ్చి బడి వ్యాను ఎక్కించింది. 

అనుకోని విషాదం
సాయంత్రం దళవాయిపల్లెకి స్కూలు వ్యాను చేరింది. ఆత్రుతగా దిగి ఇంటివైపు నడక సాగించింది కుసుమ. స్కూల్‌లో జరిగిన విశేషాలు తల్లికి తెలియజేయాలని ఉబలాటపడింది. జరిగిన వాటిని తలుచుకుం టూ స్కూలు వ్యాను వెనుక నుంచి ఇంటికి బయలుదేరింది. ఇంతలో డ్రైవర్‌ వ్యాను వెనుకకు నడపడంతో తప్పించుకోలేక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. బంధువుల రోదనలతో గ్రామం దద్దరిల్లింది. స్థానిక ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు