డిప్యుటేషన్ సాకుతో స్కూల్‌కు ఎగనామం

26 Oct, 2014 04:30 IST|Sakshi

కర్నూలు విద్య : విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణలోపం కారణంగా ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారి ఇష్టం వచ్చిన సమయానికి పాఠశాలకు వస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సంతకాలు చేసి సొంత పనులు చేసుకుంటున్నారు. మరికొందరు ఇతర వ్యాపారాలతో బోధనకు హాజరు కావటం లేదు.. దీనికి తాజా నిదర్శనం ఓ ప్రధానోపాధ్యాయుడి  నిర్వాహకం... కల్లూరు మండలం ఎన్‌టిఆర్ నగర్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా జె.నాగేశ్వరరెడ్డి పని చేస్తున్నాడు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతులకు 204 మంది  విద్యార్థులు చదువుతున్నారు.

వీరికి విద్యను బోధించడం కోసం హెచ్‌ఎంతో కలిపి ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన వివిధ కారణాలతో పలుమార్లు సెలవులు పెట్టారు. జులై 1 నుంచి 15 వరకు అనారోగ్య కారణాల వల్ల మెడికల్ లీవ్ పెట్టి, 16, 17 తేదిల్లో స్కూల్‌కు వచ్చినట్లు సంతకాలు చేశారు.18  నుంచి జిల్లా సాధారణ పరీక్షల విభాగం నందు ఆన్‌డ్యూటీపై పని చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. 2011 లో అప్పటి డీఈఓ వెంకటసుబ్బయ్య జె.నాగేశ్వరరెడ్డిని డీసీఈబీలో పని చేసేందుకు డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు తెలిసింది. ఆ తరువాత రెండేళ్లకు గడువు తీరినట్లు తెలిసింది.

డీసీఈబీలో పని చేసేందుకు అనుభవం వున్న వారికి అదనపు బాధ్యతలు అప్పగించేందుకు జిల్లా విద్యాధికారి కె.నాగేశ్వరరావు జులైలో మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. స్కూల్‌కు వెళుతూనే మధ్యాహ్నం డీసీఈబీలో    పని చేయాల్సి ఉంది. అయితే దీన్నో సాకుగా చూపి జులై 18  నుంచి అసలు స్కూల్ వైపుకే వెళ్లటం లేదు. తన స్థానంలో బీఈడీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థినితో చదువు చెప్పిస్తున్నారు. ఇందుకు ఆమెకు నెలకు రెండు వేల నుంచి రూ.3 వేల వేతనం ఇస్తున్నట్లు తెలిసింది. డీసీఈబీని సైతం ఇటీవలే విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి రద్దు చేశారు. ఆ తరువాతనైనా స్కూల్‌కి వెళ్లారా అంటే అదిలేదు.   విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు స్కూల్ వ్యవహారాలు చూసేందుకు అదే స్కూల్‌లో పని చేస్తున్న మరో టీచర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు