ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

17 Jun, 2019 11:29 IST|Sakshi
ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్గవి

ఉపాధ్యాయిని తీరే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ

బాలిక పరిస్థితి విషమం

సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): ఆదర్శ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని తీరుతో మానసిక వేదనకు గురై ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గిన్నె భార్గవి ఆత్మహత్యకు యత్నించింది. గత కొద్ది కాలంగా ఉపాధ్యాయిని కక్ష కట్టి ఎన్నో విధాలుగా వేధిస్తునట్లు తమ కుమార్తె అనేకసార్లు వాపోయినట్లు మండలంలోని గోసాం గ్రామానికి చెందిన గిన్నె అసిరినాయుడు (పాలు రెడ్డి) తెలిపారు. శనివారం ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ప్రవేశం లేదని ఉపాధ్యాయిని కరాఖండిగా చెప్పడంతో భార్గవి మానసిక ఆందోళనకు గురైనట్లు తండ్రి తెలిపారు.

శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆసుపత్రి పాలైనట్టు పేర్కొన్నారు. హుటాహుటిన శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తండ్రి చెప్పారు. అయితే తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని జె.ఆర్‌.పురం ఎస్సై వి.బాలకృష్ణ తెలిపారు.

ప్రిన్సిపాల్‌ వివరణ
ఈ దుర్ఘటనపై ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ కె.మహేశ్వరరావును వివరణ కోరగా.. ఆదర్శపాఠశాల వసతి గృహం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైందని, ఆమె ప్రథమ సంవత్సరం చివరిలో ఒక నెలరోజులపాటు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల హాస్టల్‌కు రాలేదని, హాస్టల్‌లో ఉన్నప్పుడే ఒకసారి కడుపులో నొప్పి అని చెబితే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుత ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి వసతి గృహంలో ప్రవేశాలకు శనివారం దరఖాస్తులు కోరామన్నారు. గతంలో అనారోగ్యం, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవద్దని హాస్టల్‌ మెయింటినెన్స్‌ చూస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని లక్ష్మికి చెప్పామని ప్రిన్సిపాల్‌ మహేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు