మెరుపై సాగరా.. గెలుపే నీదిరా..

7 May, 2019 12:55 IST|Sakshi
ఎస్‌డీ కేర్‌ ఆఫ్‌ వెంచపల్లి సినిమా యూనిట్‌తో..

డ్యాన్స్‌లో దుమ్మురేపుతున్న నిర్మల్‌ 

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గానూ అవకాశాలు  ఫేస్‌బుక్‌ ద్వారా సినీ రంగంలోకి..

తణుకు అర్బన్‌: సంగీతం వినిపిస్తే చాలు కాళ్లు, చేతులే కాదు యావత్‌ శరీరం స్ప్రింగ్‌లా వంగిపోయేలా నృత్యం చేసేయడం ఈ బాలుడి సొంతం. నృత్యం అంటే ప్రాణం అంటూ డ్యాన్స్‌తో ఉర్రూతలూగిస్తున్నాడు తణుకుకు చెందిన విద్యార్థి ఈద నిర్మల్‌ వినయ్‌కుమార్‌. తణుకుకు చెందిన ఈద నవీన్‌ సుందర్, నీలిమదేవి పెద్ద కుమారుడు నిర్మల్‌ వినయ్‌కుమార్‌. అతడికి చిన్ననాటి నుంచి నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లితండ్రులు నృత్యంపై పట్టు సాధించేలా శిక్షణ ఇప్పించారు. దీంతో ఇప్పుడు పలుప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు.  ఖమ్మం, ఏలూరు తదితర ప్రాంతాల్లో జరిగిన నృత్యప్రదర్శనల్లో పాల్గొన్నాడు.  అంతేకాదు ఇటీవల చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు నవీన్‌. 

ఫేస్‌బుక్‌ ద్వారా సినీ అరంగ్రేటం
కుమారుడి నృత్యం వీడియోలను తల్లి నీలిమదేవి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేయడం అలవాటుగా చేసుకున్నారు. వీడియోల్లో కళ్లు చెదిరేలా కుమార్‌ వేసిన స్టెప్పులు అతడి కెరీర్‌ను మలుపుతిప్పాయి. వీడియో చూసిన ఎస్‌డీ కేర్‌ ఆఫ్‌ వెంచపల్లి  సినిమా దర్శకుడు పాలిక్‌ శ్రీనివాస్, నిర్మాత గోదారి భానుచందర్‌ తమ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తీసుకుని పాలేరు పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కొత్త హీరో శ్రీజిత్‌ లవణ్, హీరోయిన్‌ కారుణ్య కత్రిన్‌తోపాటు నవీన్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు హీరో సుమన్‌ నటిస్తున్న సడి సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అవకాశం రాగా, ఇటీవల మరో సినిమాలో కూడా అవకాశం దక్కడం విశేషం.

అన్నింటా ప్రథమమే..
నృత్యం అంటే ప్రాణం అంటూనే ఇటు విద్యలోనూ ముందు వరుసలో నిలుస్తున్నాడు నవీన్‌. చిత్రలేఖనం, వాలీబాల్, క్రికెట్‌లో కూడా నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. అన్నిటికంటే మించి గొప్ప దాన గుణం నిర్మల్‌ వినయ్‌కుమార్‌ సొంతం. తల్లితండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీని అనాథలు, వికలాంగులకు ఖర్చుచేస్తుండటం అతని నైజం. ఇలా చిన్నతనంలోనే అటు డ్యాన్స్, కళలు, చదువులో రాణిస్తూ భేష్‌ అనిపించుకుంటున్నాడు.

కుటుంబ నేపథ్యం
తండ్రి ఈద నవీన్‌సుందర్‌ తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం జెడ్పీ హైస్కూలులో జూనియర్‌ అసిస్టెంట్‌గా, తల్లి నీలిమదేవి తణుకు జెడ్పీ బాయ్స్‌ హైస్కూలులో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌ ప్రస్తుతం 7వ తరగతి పరీక్షలు రాసి 8వ తరగతిలోకి ప్రవేశించనున్నాడు. తమ్ముడు నిర్మల్‌ రాజేష్‌కుమార్‌ ఎల్‌కేజీ చదువుతున్నాడు. తల్లి కూడా చదువుకునే వయసు నుంచి మంచి నృత్యకారిణి కావడం విశేషం.

లక్ష్యాన్ని చేరేలా ప్రోత్సహిస్తున్నాం
నృత్యం కోసం ప్రాణం పెట్టే మా బాబు అన్ని రంగాల్లోనూ ముందుం టున్నాడు. తను ఎంచుకున్న రంగంలో ప్రోత్సాహించాలని నా భర్త నవీన్‌సుందర్, నేను నిశ్చయించుకున్నాం. క్రీడలు, చిత్రలేఖనం, దాన గుణంలోనూ వాడికి వాడే సాటి. బాబు లక్ష్యాన్ని చేరుకునేందుకు మేము కష్టపడతాం. చదువుతోపాటు వాడి అభిరుచి మేరకు ఇటు నృత్యం అటు సినీ రంగంలోనూ ప్రోత్సహిస్తున్నాం.–ఈద నీలిమదేవి, తల్లి

తల్లితండ్రుల ప్రోత్సాహంతోనే..
నృత్యంలో ఆరితేరిన అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. నృత్యంలోనే నడుస్తున్న నాకు సినీ రంగంలోనూ అవకాశం వచ్చింది. ఈ రెండు రంగాలతోపాటు విద్యకు కూడా ప్రాధాన్యతనిచ్చి మంచి స్థానానికి చేరుకోవాలనేది నా ఆశ.–ఈద నిర్మల్‌వినయ్‌కుమార్, తణుకు

మరిన్ని వార్తలు