‘నడక’యాతన

16 Mar, 2018 10:29 IST|Sakshi
కోవెలకుంట్లలో మండుటెండకు బీటీరోడ్డు వేడెక్కడంతో పక్కనే చెప్పులు లేకుండా నడిచి వెళుతున్న విద్యార్థులు

మండుతున్న ఎండలు విద్యార్థులకు తప్పని నడక

ముళ్లబాటల మధ్యే పాఠశాలలకు..

పాదరక్షలు కూడా లేక అవస్థలు

కోవెలకుంట్ల: చదువు కోసం ఇతర ఊళ్లకు రోజూ నడిచి వెళ్తున్న విద్యార్థుల బాధలు అన్నీ ఇన్నీ కావు. కాళ్లకు చెప్పులు లేకుండా.. ఒట్టికాళ్లతో ముళ్లబాటల గుండా రోజూ కొన్ని కిలోమీటర్ల మేర నడిచి  వెళ్తున్నారు. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 12 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటున్నాయి. పాఠశాల ముగిశాక విద్యార్థులు మండుటెండలోనే ఒట్టికాళ్లతో నడుచుకుంటూ ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి. దీంతో కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. మట్టిరోడ్లపై ముళ్లు గుచ్చుకుంటున్నాయి. వీరి అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

జిల్లాలో 2,283 ప్రాథమిక, 932 ప్రాథమికోన్నత, 898 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6,41,530 మంది చదువుతున్నారు. పలు గ్రామాల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేవు. పక్కనున్న గ్రామాలకు వెళ్లాలి. జిల్లాలో మొత్తం 1,435 గ్రామాలున్నాయి. వీటిలో 646 గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లేవు.  డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలోనే దాదాపు 110 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు.  జిల్లాలో 70 గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నా..బస్సులు తిప్పకపోవడం గమనార్హం. చాలా గ్రామాల విద్యార్థులకు పాఠశాల సమయానికి కనీసం ఆటోలు కూడా ఉండడం లేదు. దీంతో కాలినడకన, సైకిళ్లపై వెళ్తున్నారు. కంకర తేలిన రోడ్లు, ముళ్లతో నిండిన దారుల గుండా భుజానికి బరువైన పుస్తకాల సంచి, చేతిలో నీళ్ల బాటిల్‌తో వెళ్లి రావాలంటే  నరకం కన్పిస్తోంది.   కాలికి ముళ్లు గుచ్చుకున్నా, రాయికొట్టుకున్నా బాధను భరిస్తూనే సమయానికి పాఠశాలకు చేరుకోవాలి. లేదంటే ఉపాధ్యాయులతో దెబ్బలు తినాల్సి వస్తుందని విద్యార్థులు భయపడుతూ వెళ్తున్నారు. కొద్దోగొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వారి∙పిల్లలు కాళ్లకు చెప్పులు, సైకిళ్లపై స్కూళ్లకు వెళుతుండగా.. నిరుపేద పిల్లల పరిస్థితి మాత్రం  దయనీయంగా ఉంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత  తొమ్మిదో తరగతి బాలికలకు మాత్రమే సైకిళ్లు అందజేసింది. మిగిలిన తరగతుల విద్యార్థినులతో పాటు బాలురకు  ఇవ్వకపోవడంతో వారు కాలినడకన వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన సైకిళ్లు కూడా నాసిరకంగా ఉండటంతో చాలా వరకు మూలన పడేశారు.  

కోవెలకుంట్ల మండలం భీమునిపాడులో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు రెండున్నర కి.మీ దూరంలోని కంపమల్ల గ్రామానికి చెందిన విద్యార్థులు రోజూ పొలాల రస్తాలో కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఇదే మండలం గుళ్లదూర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు పొట్టిపాడు గ్రామ విద్యార్థులు ఆయకట్టు దారి గుండా వెళ్తున్నారు.
కోవెలకుంట్ల పట్టణంలో మూడు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి పలు గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. పాఠశాల సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వెలగటూరు, బిజనవేముల, అమడాల గ్రామాల విద్యార్థులు నడుచుకుంటూ వస్తున్నారు.
రేవనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు లింగాలకు చెందిన విద్యార్థులు గుండుపాపల నుంచి నడుచుకుంటూ రాక తప్పడం లేదు.
కొలిమిగుండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మీర్జాపురం, నాయినిపల్లె నుంచి విద్యార్థులు నడిచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంకిరెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలకు రావాలంటే బందార్లపల్లె, తుమ్మలపెంట గ్రామాల విద్యార్థులదీ ఇదే పరిస్థితి.
అబ్దులాపురం హైస్కూల్‌కు ఉమ్మాయిపల్లె, కోరుమానుపల్లె నుంచి విద్యార్థులు నడిచి వెళ్తున్నారు.
అవుకు మండలంలోని సుంకేసుల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చనుగొండ్ల, కాశీపురం గ్రామాల నుంచి కాలినడకన వస్తున్నారు.
చెన్నంపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శివవరం గ్రామానికి చెందిన విద్యార్థులు , సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ముచ్చలపురి, ఎగ్గోని, కొత్తపేట గ్రామాల విద్యార్థులు కాలినడకన వచ్చి చదువుకోవాల్సి వస్తోంది.

మట్టిరోడ్డుపై అవస్థలు
ఊళ్లో ఉన్నత పాఠశాల లేదు. పక్క గ్రామమైన గుళ్లదూర్తికి వెళ్తున్నాం. నాతో పాటు 20 మందిమి అక్కడికి వెళ్లి చదువుకుంటున్నాం. గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో పొలాల దారి గుండా రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఐదుగురు విద్యార్థులకు సైకిళ్లు ఉన్నప్పటికీ మట్టిరోడ్డు కావడంతో కొన్నిచోట్ల వాటిని తోసుకుంటూ వెళ్లాలి.-విజయ్, 8వ తరగతి, పొట్టిపాడు

మరిన్ని వార్తలు