పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

24 Aug, 2013 01:42 IST|Sakshi

సంగారెడ్డి మున్సిపాలిటీ/పుల్‌కల్,  న్యూస్‌లైన్: మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పుల్‌కల్ మండలం లక్ష్మిసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హన్మానాయక్ తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ పాఠశాల ఉపాధ్యాయుడు, పుల్‌కల్ ఎంఈఓ విశ్వనాథం తెలిపిన వివరాల ప్రకారం...హన్మానాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ‘అక్షయపాత్ర’ ద్వారా మధ్యాహ్నభోజనం అందిస్తున్నారు. గురువారం ఎప్పటిలాగే పాఠశాలలో మధ్యాహ్నభోజనం చేసిన విద్యార్థులు అనంతరం ఇళ్లకు వెళ్లారు.
 
 అయితే గురువారం సాయంత్రం ఒకరిద్దరు విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. ఇక గురువారం అర్ధరాత్రి శశి అనే విద్యార్థికి విరోచనాలు, వాంతులు అధికం కావడంతో తల్లిదండ్రులు ఆమెను 108 వాహనంలో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  శుక్రవారం ఉదయం మరో 19 మంది విద్యార్థులు క్రాంతి కిరణ్, యశ్వంత్, వైష్ణవి, అరుణ్, నిఖిత, సంధ్యా, సోని, ఎం. నిఖిత, మౌనిక, జయిరాం, కిరణ్, బల్‌రాం, నితిన్, గాయత్రి, అనిత, వెన్నెల, జైసింగ్, బాబులాల్, కావేరిలు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పుల్‌కల్ మండల ఎంఈఓ విశ్వనాథం వెంటనే విద్యార్థులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుంత విద్యార్థుల పరిస్థితి బాగానే ఉండడంతో వైద్యులు వారిని ఇంటికి పంపారు. విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న డీఈఓ గాజర్ల రమేశ్ వెంటనే హన్మానాయక్ తండాకు వెళ్లారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
 
 కలుషిత నీరే కారణం; డీఈఓ
 విద్యార్థులకు అస్వస్థతకు కలుషిత  నీరే కారణమని డీఈఓ రమేశ్ ప్రాథమికంగా నిర్ధారించారు. సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, అక్షయపాత్ర అందించిన భోజనం ద్వారా విద్యార్థులకు అనారోగ్యానికి గురైనట్లు వైద్యాధికారులు ధృవీకరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి శశిని పరామర్శించి  వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, జిల్లా వైద్యాధికారి రంగారెడ్డి దీనిపై వైద్య సిబ్బందితో నీటి పరీక్షలు జరిపేందుకు ఆదేశించారు. గత సంవత్సరం కూడా నీటి కలుషితమై వాంతులు, వీరేచనాలు జరిగాయని గ్రామస్తులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను గిరిజన సంఘం నాయకుడు గోవర్ధన్‌నాయక్ తదితరులు పరామర్శించారు. మరోవైపు పుల్‌కల్ మండల ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణ, విద్యార్థుల అస్వస్థతకు కలుషిత నీరు కారణం కాదన్నారు. గ్రామానికి మంజీరా సరఫరా నిలిచిపోయి చాలారోజులైందనీ, ఆ గ్రామస్థులంతా బోరుబావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారన్నారు.

మరిన్ని వార్తలు