మూసేసిన స్కూల్లో టీచర్ పోస్టులా?!

8 Aug, 2014 03:44 IST|Sakshi

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పాఠశాల అది. రెండేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూతవేశారు. ఆ స్కూల్లో పదేళ్ల కిందట మంజూరైన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికీ విశ్వప్రయత్నాలు చేస్తోంది యాజమాన్యం. అందుకు విద్యాశాఖలోని  కొందరు లోపాయకారిగా పావులు కదుపుతున్నారు.
 
 సాక్షాత్తు అడిషనల్ జాయింట్ కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ప్రక్రియను నిర్వహించిన నెల్లూరు డిప్యూటీ ఈఓను తప్పించి తాజాగా గూడూరు డిప్యూటీ ఈఓకు ఆ బాధ్యతను అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. మళ్లీ ఆ ఉపాధ్యాయ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన మూసేసిన సీఏఎం స్కూల్ తరుపున ఉద్యోగాలు కల్పించి ఇతర ఎయిడెడ్ స్కూళ్లకు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అందుకు ప్రస్తుతం ఇన్‌చార్జీ డీఈఓ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, బాధితులు అందజేసిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

 నగరంలోని సీఏఎం ఉన్నత పాఠశాలను వందేళ్ల క్రితం మిషనరీలు ప్రారంభించాయి. ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించే క్రమంలో ఎయిడెడ్ పాఠశాలగా మారింది.
 1980వ దశకం వరకు అప్రహతిహతంగా విద్యారంగంలో ఆ పాఠశాల ఓ వెలుగు వెలిగింది. జస్టిస్ అన్సారీ, బెజవాడ గోపాల్‌రెడ్డి వంటి ఉద్దండులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించారంటే  ఈ పాఠశాల ప్రత్యేకతలను చెప్పనవసరంలేదు. యాజమాన్య నిర్లిప్తత, ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ప్రభావంతో 90వ దశకం నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేపి తగ్గనారంభించింది. ఈ క్రమంలో 2004లో ఎనిమిది టీచర్‌పోస్టుల నియామకానికి యాజమాన్యం నిర్ణయించింది. అప్పుడు పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య 774. 2004 ఆగస్టులో నాలుగు స్కూల్‌అసిస్టెంట్లు, నాలుగు ఎస్జీటీ పోస్టులకు మొత్తం ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో మ్యాథ్స్ అసిస్టెంట్ మూడు, ఫిజికల్‌సైన్స్ ఒకటి, ఎస్జీటీలు నాలుగు పోస్టులున్నాయి. అదే ఏడాది అక్టోబర్‌లో 32 మందికి అర్హత పరీక్షను నిర్వహించారు. ఫలితాలు విడుదల చేయకముందే 2004 డిసెంబర్‌లో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీని రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కొంతకాలం తరువాత పాఠశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఎయిడెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బ్యాన్ ప్రకటించకముందు ఇంటర్వ్యూలు నిర్వహించిన వారికి పోస్టులు ఇవ్వవచ్చని  సుప్రీంకోర్టు 2013 మార్చిలో తీర్పునిచ్చింది.
  ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని యాజమాన్యం అధికారులు, అభ్యర్థులకు చెబుతూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. అదే నెలలో ఇంటర్వ్యూల పేరుతో 32 మంది అభ్యర్థులకు సీఏఎం హైస్కూల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లిమూసేసిన పాఠశాల్లో టీచర్ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు పొంతనలేని సమాధానాలతో చల్లగా జారుకున్నారు. అనంతరం స్కూల్ పనిచేయడంలేదని, ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు లేవని, ఇంటర్వ్యూలు పంపిన కాల్‌లెటర్లు, అభ్యర్థుల హాల్ టికెట్లు, జవాబుపత్రాలు లేవని  డిప్యూటీ ఈఓ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అప్పుడు డీఈఓగా వ్యవహరిస్తున్న మువ్వా రామలింగం ఈ వ్యవహారంలో తలదూరిస్తే ఉన్న ఆరోపణలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని మిన్నకుండిపోయారు.
 
 ఆర్‌జేడీ కార్యాలయం ఒత్తిడి, జిల్లా విద్యాశాఖ తాజాగా ఈ ఏడాది జూన్‌లో మళ్లీ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఈ పంచాయతీ ఏజేసీకి చేరింది.  విద్యాశాఖ అధికారులను, పాఠశాల యాజమాన్య ప్రతినిధిని పిలిపించి విచారణ చేపట్టారు. అవసరమైన పత్రాలు లేకుండా పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటూ ఇంటర్వ్యూ నిర్వహణాధికారి అడిగిన పత్రాలను చూపాలని యాజమాన్యప్రతినిధులు పలు సూచనలు చేశారు. కొద్ది రోజులు మిన్నకున్న ఆ ప్రతినిధి లోపాయకారి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇన్‌చార్జీ డీఈఓ తన వంతు సహాయ సహకారాలందిస్తున్నట్లు సమాచారం. మూసేసిన పాఠశాల్లో పోస్టులు భర్తీచేయడం ఏమిటని? విద్యాశాఖలోని ఉద్యోగులు విస్మయం చెందుతున్నారు.
 
 మూసివేసింది ఇలా : చరిత్ర క లిగిన పాఠశాలకు రెండు అతిపెద్ద భవనాలు, విశాలమైన మైదానం ఉంది. ఇప్పటికే సీఏఎం హైస్కూల్లో చాలా భాగం అన్యాక్రాంతమైంది. యాజమాన్యం విడతలు విడతలుగా దాన్ని విక్రయించేసింది. స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో  ఉన్న విద్యార్థులను బలవంతంగా బయటి స్కూళ్లకు పంపివేశారు. అదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సైతం పక్క స్కూల్లో చేర్పించారు. 2012లో సుమారు 180 మంది విద్యార్థులు ఉన్నప్పుడు స్కూల్‌ను ఆకస్మికంగా మూసివేశారు. ఇందుకు సంబంధించిన సమాచారం ముందుగా విద్యాశాఖకు పంపలేదు. అప్పుడు పనిచేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులను, ముగ్గురు నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్‌పై పంపారు.
 
 ఎందుకింత శ్రద్ధ?... ముడుపులు ముట్టినందుకేనా?
 2004లో రాతపరీక్ష నిర్వహించామని చెప్పే యాజమాన్యం ఈ అంశంపై విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎనిమిది పోస్టులకు సుమారు పది మంది వద్ద రూ. లక్షల్లో వసూలు చేశారనేది  బహిరంగ రహస్యం. వారి ఒత్తిడి తట్టుకోలేక కోర్టును ఆశ్రయించేందుకు ఆ అభ్యర్థుల నుంచే మళ్లీ డబ్బులు వసూలు చేశారు. ఉన్న పోస్టులకంటే ఎక్కువ మంది దగ్గర అధిక మొత్తంలో వసూలు చేసినట్లు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు వద్ద నుంచి తీసుకున్నట్లు సమాచారం.
 
 అప్పడు రాతపరీక్షకు హాజరైన పలువురు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోయారు. కొంత మందికి రిటైర్‌మెంట్ డేట్ దగ్గర పడింది. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చిన అభ్యర్థుల ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వాన్ని, విద్యాశాఖను, అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలను పునఃప్రారంభించకుండా పోస్టులను భర్తీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 కోర్టు ఆదేశాలను పాటించాల్సి ఉంది
 కోర్టు ఉత్తర్వులను పాటించాలి . సీఏఎం స్కూల్ ఉపాధ్యాయుల భర్తీపై పూర్తి నివేదికను ఏజేసీ ఇవ్వమన్నారు. సాధ్యాసాధ్యాలను ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
  ఉష, డీఈఓ
 

మరిన్ని వార్తలు