కార్పొ‘రేటు’ మోత

18 Jun, 2015 01:24 IST|Sakshi

 ఏలూరు సిటీ :బడిగంటలు మోగటంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల పట్టీ చూస్తే గుండెలు గుభేల్‌మంటున్నాయి. ఏటా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచుతూ పోవటంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. విద్యా ఖర్చు మోతెక్కిపోతోంది. ఒక్క జూన్ నెలలోనే జిల్లాలో పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే విద్యా ఖర్చు సుమారురూ.500 కోట్లు ఉం టుందని విద్యా నిపుణుల అంచనా. ఫీజులతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బుక్స్ బ్యాగ్, క్యారేజీ బ్యాగ్, బూట్లు, యూనిఫామ్, బస్సు రవాణాకు చెల్లించాల్సిన  సొమ్ము అదనం.  ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల క్రమబద్ధీకరణకు గతంలో ఓ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలోకి రాలేదు. సర్కారు బడులు పిల్లల తల్లిదండ్రులను ఆర్షించలేకపోవటంతో సామాన్యులు సైతం ప్రైవేటు స్కూళ్లవైపే మొగ్గుచూపుతున్నారు.
 
  ఫీజులతో బాదేస్తున్నారు
 మారిన సామాజిక పరిస్థితుల్లో అప్పు చేసైనా తమ పిల్లలకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. ఒకప్పుడు ఎల్‌కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.3 వేలు ఫీజు ఉంటే ప్రస్తుతం రూ.12 వేలకు పైగా గుంజుతున్నారు. టెక్నో, ఇ-టెక్నో, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు కూడా కలిపి ఫీజులు చెబితే కళ్లు తిరగాల్సిందే. ప్రాథమిక విద్యకే సాధారణంగా ఒక్కో విద్యార్థికి ఏటా సుమారు రూ.25 వేలు వెచ్చించాల్సి వస్తోంది.
 
 జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 2.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు 56వేల 223 మంది, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులు 80,822 మంది, హైస్కూల్ స్థాయి విద్యార్థులు 90వేల 520 మంది ఉన్నట్టు విద్యాశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఒక్కో విద్యార్థి ఖర్చు సగటున రూ.25వేలు అనుకుంటే జిల్లాలో విద్యా ఖర్చు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌లో అయితే ప్రవేశ పరీక్ష నిర్వహించి పిల్లాడు చదువులో వెనుకబడి ఉన్నాడని, మంచి శిక్షణ ఇవ్వాలంటే అదనపు ఫీజులు చెల్లించాలంటూ గుంజుతున్నారు.
 

మరిన్ని వార్తలు