అప్పుల మాసమిది..

13 Jun, 2015 03:39 IST|Sakshi

 సుబ్బారావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆయన నెల జీతం రూ.12 వేలు. తన కుమారున్ని కార్పొరేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతిలో చేర్పించడానికి రూ.26 వేలు అడిగారు. ఐఐటీ, ఒలంపియాడ్ సెక్షన్ అయితే రూ.45 వేలు అవుతుందని చెప్పారు. బ్యాగు, పుస్తకాలు, స్కూల్ డ్రస్,  షూ, బస్సు చార్జీ దాదాపు రూ.16,500 అవుతుంది. ఈ లెక్కన జనరల్ సెక్షన్‌లో అయితే రూ.42,500.. ఐఐటీ, ఒలంపియాడ్ సెక్షన్‌లో అయితే రూ.61,500 అవుతుంది. ‘చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పిల్లలు, బంధువుల పిల్లలు ఐఐటీ సెక్షన్‌లో ఉన్నారు. మన పిల్లాడినీ ఐఐటీ సెక్షన్‌లోనే చేరుద్దాం. మనం ఎత్తిపెట్టిన మొత్తానికి తోడుగా మరికొంత అప్పు చేద్దాం. ఒక్కగానొక్కడు.. బాగా చదివించుకుందాం.. అప్పు ఎలాగోలా తీర్చుకుందాం’ అని సుబ్బారావు భార్య తెగేసి చెప్పింది.
 
 కడప ఎడ్యుకేషన్ :   జూన్ నెల వచ్చిందంటే చాలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులతో పాటు స్కూల్ ఫీజును చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రచారార్భాటాలతో ఊదరగొడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ధాటికి సామాన్యులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. అలాంటి స్కూళ్లలో చదివించకపోతే భవిష్యత్ బావుండదనే బెంగతో అప్పులు చేయడానికి వెనుకాడటం లేదు.

దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఏడాది ‘జూన్’ ఖర్చుల కోసం కొంత మొత్తం దాస్తుంటారు. పెరుగుతున్న ఫీజులు, పుస్తకాల ధరల వల్ల ఇలా దాచిన డబ్బు సరిపోవడం లేదు. దాదాపు సగం మొత్తం అప్పు చేయాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు ఎంతగా తగ్గించుకున్నా ఈ నెలలో అప్పు చేయక తప్పడం లేదు. ఫీజును మూడు కంతుల్లో చెల్లించడానికి అవకాశం ఉన్నా, తొలి కంతులో సగం చెల్లించాలి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం.

 ఏ స్కూలు మంచిది..
 ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల ప్రాంగణాలు విద్యార్థుల తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలనేది తల్లితండ్రులకు ప్రస్తుతం ఎదురవుతున్న ప్రథమ పరీక్ష. అందమైన హోర్డింగులు, రంగు రంగుల కరపత్రాలతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వారు ఆకర్షిస్తున్నారు. వీటిలో నిపుణులైన అధ్యాపకులు ఉన్నారనే విషయాన్ని నిర్ధారించే వారెవరూ ఉండరు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు చెప్పింది నమ్మడం తప్ప మరో మార్గం లేదు.

 ఏ పాఠశాలలో అయినా వాస్తవంగా సైన్స్, మ్యాథ్స్, ఆంగ్లంపై ఎక్కువగా దృష్టి సారించాలి. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తిని గమనించి చాలా పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్ మెథడ్ అంటూ తెరపైకి తెచ్చాయి. ఈ సెక్షన్‌లో అయితేనే సైన్సు, మ్యాథ్స్‌పై మంచి పట్టు వస్తుందని, ఇంజనీరింగ్/మెడిసిన్‌లో సీటు సాధించాలంటే ఇక్కడ చేర్చక తప్పదని నొక్కి చెబుతుండటంతో తల్లిదండ్రులు అప్పులు చేయడానికి వెనుకాడటం లేదు. కాన్సెప్ట్, ఐఐటి, ఇంటర్ నేషనల్ ఒలంపియాడ్, టెక్నో, ఈ టెక్నో, లెర్నింగ్, స్మార్ట్ ఇలా కొత్త పేర్లు అర్థం కాక.. ఏది మంచిదో తేల్చుకోలేక పలువురు స్కూల్ పీఆర్వోల మాయాజాలానికి బలవుతున్నారు.

  సౌకర్యాలు దయనీయం
 పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం గురించి ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ఈ చట్టం ప్రకారం కొన్ని సీట్లు పేద పిల్లలతోపాటు ఎస్సీ, ఎస్టీల పిల్లలకు ఇవ్వాల్సి ఉండగా అలాంటిది ఎక్కడా అమలు కావడం లేదు. ఇక సౌకర్యాల విషయానికొస్తే.. వారు బ్రోచర్‌లో చూపించినంతగా లోపలుండదు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరిపడా మరుగు దొడ్లు ఉండవు. ఒక్కో ఫ్లోర్‌కు ఒకటి.. రెండు ఉన్నా వాటి నిర్వహణ ఘోరంగా ఉంటోంది. మరికొన్ని పాఠశాలల్లో గాలి వెలుతురు లేని దుస్థితి ఉంది. ఫీజులను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. పాఠశాలలో తరగతి ఫీజు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఫీజుల నియంత్రణ కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా అవి ఎక్కడా అమలు కావడం లేదు.
 
 ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు
 ప్రభుత్వం నిర్ణయిం చిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. అప్పటికీ మారకపోతే ఆయా పాఠశాలలకు సంబంధించిన గుర్తింపును రద్దు చేస్తాం.
 - బండ్లపల్లె పత్రాప్‌రెడ్డి,జిల్లా విద్యాశాకాధికారి.

మరిన్ని వార్తలు