మళ్లీ బడికి

13 Jun, 2016 01:06 IST|Sakshi

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఏ ఏటికాయేడు కలగా మిగులుతున్న వసతుల కల్పన
డీఎస్సీ నియామకాలు పూర్తయినా ప్రగతి శూన్యం
యూనిఫాం పంపిణీపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
వచ్చినా స్కూళ్లకు చేరని 21లక్షల పాఠ్య పుస్తకాలు

 

గుంటూరు ఎడ్యుకేషన్ : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు పుస్తకాలు చేతపుచ్చుకుని తిరిగి పాఠశాలకు వెళ్లాల్సిన   సమయం ఇది. ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి పర్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా,  క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, బెంచీలు, సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు కల్పన ఏ ఏటికాయేడు కలగానే మిగిలి పోతోంది.


డీఎస్సీ-2014 నియామకాల ద్వారా జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని భావించినా అది సఫలీకృతం కాలేదు. 671 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లలో 322 మందికి పాఠశాలల్లో ఖాళీలు లేవని పోస్టింగ్స్ కల్పించకపోవడం అవరోధంగా మారింది.


పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని ఎంత వరకు నెరవేర్చుతుందనేది అనుమానమే. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న 6.50 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన 26,37,753 పాఠ్య పుస్తకాల్లో జిల్లాకు 21 లక్షలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.  వచ్చిన పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు పాఠశాలలకు చేరలేదు.


ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండు జతల ఉచిత యూనిఫాం పంపిణీ గతి తప్పింది. గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన యూనిఫాంను చివర్లో ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రణాళిక సిద్ధం చేయలేదు.


పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం అధ్వానంగా మారింది. నిర్వహణకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్క దారి పట్టించింది. సురక్షిత తాగునీటి కల్పనలో ప్రగతి శూన్యంగా ఉంది. జిల్లాలోని 400 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మినహా,  3600 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో  తాగునీటి సరఫరాకు  చేపట్టిన చర్యలు శూన్యం.


నూతన తరగతి గదుల నిర్మాణాలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని 300 పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.  641 కిచెన్ షెడ్లు నిర్మించాలనే లక్ష్యానికి ఒక్కటీ పూర్తి కాలేదు.

మరిన్ని వార్తలు