కళలకు ‘చంద్ర’గ్రహణం

23 Mar, 2019 11:27 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్‌:  ‘రాజాశ్రయం లేనిదే కళలు మనుగడ సాగించలేవంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలే ఈ బాధ్యతను తలకెత్తుకోవాలి. దురదృష్టవశాత్తు,  గత నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఆర్భాటాలే తప్ప. కళాసాంస్కృతిక రంగాల పట్ల ఏ కోశానా ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనపడటం లేదు’.. ‘సంగీత, నాట్య, వైణిక సుధాకర’, ధవళేశ్వరం, రావులపాలెం, రాజమహేంద్రవరంలలో సాంప్రదాయ కళల్లోశిక్షణ ఇస్తున్న శ్రీరాధాకృష్ణ సంగీత కళాక్షేత్ర వ్యవస్థాపకుడు డాక్టర్‌ గోరుగంతు బదరీనారాయణ ఆవేదన ఇది.  దానవాయిపేటలోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రచారార్భాటాలు తప్ప, ఈ ప్రభుత్వ హయాంలో కళారంగానికి వీసమెత్తు మేలు కలగలేదని అంటున్నారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివరాలు, వెల్లడించిన అభిప్రాయాలు..


సాక్షి:  గత నాలుగున్నరేళ్ళకుపైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, కళారంగాల వికాసానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మీ అభిప్రాయం?
బదరీనారాయణ: శాస్త్రీయ, సాంప్రదాయ కళల వికాసానికి, ఆధ్యాత్మిక రంగంలో ప్రభుత్వం చేసింది శూన్యం. గతంలో సాంస్కృతిక శాఖకు కళలతో సంబంధం ఉన్న వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించేవారు. పాలనా నిర్వహణకు ఐఏఎస్‌ అధికారి ఉండేవారు. ఇప్పుడు కళలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల చేతిలో ఈ శాఖ పనిచేస్తోంది. వీరికి కళలపై, కళాకారుల సమస్యలపై ప్రాథమిక అవగాహన కూడా లేదు. ఈ ధోరణి చూస్తూంటే కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వెలువడిన ఒక సినిమాలోని (‘స్వర్ణకమలం’ కావచ్చు) దృశ్యం గుర్తుకు వస్తోంది.

వేదపండితులకు భృతి ఇస్తున్నారని తెలిసి, ఒక ఘనపాఠి సంబంధిత అధికారి వద్దకు వస్తాడు. ‘అయ్యా, నేనొక ఘనపాఠీని’ అని పరిచయం చేసుకుంటాడు. ‘ఘనపాఠీయా?–అంటే ఏమిటి? అదో డిగ్రీనా, బీఏ, ఎంఏలాగా?’ అని ఆ అధికారి అడుగుతాడు! ఇప్పుడు సాంస్కృతిక శాఖలో కళారంగానికి చెందిన నిష్ణాతులు ఎవరున్నారు? అన్ని సంస్థలూ రాజకీయపునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి తప్ప!..ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వరంగానికి సంబంధించి, ఒకే ఒక సంగీత, నృత్యపాఠశాల ఉంది. మరికొన్ని కళాశాలల స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆయన అకాలమరణంతో అన్నీ అటకెక్కాయి.

సంప్రదాయానికి విరుద్ధంగా గోదావరి హారతి
సాక్షి: సంప్రదాయాలకు ఎందుకు చెల్లుచీటీ ఇస్తున్నారు? సినీజీవుల సూచనలమేరకే మార్పులు జరుగుతున్నాయా?
బదరీనారాయణ: నేను సినిమాలకు వ్యతిరేకం కాదు. కానీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో ఆయా నిపుణులతో నిర్వహణ సాగాలి. గంగానది మెట్లపై నిలబడి, అర్చకులు గంగాదేవికి హారతులు ఇస్తారు. ఇక్కడ? గోదావరి జలాలలో పంటుపై నిలబడి, మెట్లకు, అక్కడ ఉన్న ఎన్టీ రామారావు విగ్రహ పృష్ఠభాగానికి హారతి ఇస్తున్నారు. ఇదెక్కడి సాంప్రదాయం? నదీప్రవాహానికి అభిముఖంగా హారతి ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు చెబుతున్నారు. ఎవరో సినిమాదర్శకులో, మరొకరో చెబితే, మార్పులు చేసేస్తున్నారు. మెట్లకు అభిముఖంగా హారతి ఇవ్వడానికి ప్రమాణం ప్రభుత్వం చూపగలదా?

వీఐపీలకు ‘వెచ్చించిన’ ప్రాంతాలట..
సాక్షి: ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను కొన్ని లక్షలు ఖర్చుచేసి, ఈవెంట్‌ మేనేజర్లకు నిర్వహణా బాధ్యతలు అప్పగించడంపై మీ అభిప్రాయం?
బదరీనారాయణ: కోటిలింగాలరేవులో జరిగిన ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యాతను కూడా బయట నుంచి తీసుకువచ్చారు. ‘వీఐపీలకు వెచ్చించిన’ ప్రాంతాలలో వారినే కూర్చోనివ్వండి’ అంటూ, ‘దిగుమతి’ అయిన యాంకర్‌ చెబుతూంటే, ప్రేక్షకులు నవ్వుకున్నారు. 

అందని ద్రాక్షలా కళాకేంద్రం అద్దెలు
సాక్షి: రాజమహేంద్రవరానికి ఎంపీ సినీరంగం నుంచే వచ్చారు కదా? ఇక్కడి పరిస్థితులపై మీ అంచనా?
బదరీనారాయణ: హైదరాబాద్‌ రవీంద్రభారతి స్థాయిలో ఆనం కళాకేంద్రాన్ని ఆధునికీకరించారు, సంతోషం! అయితే, అద్దె ఎవరికీ అందుబాటులో లేదు. ఒకరోజుకు సుమారు రూ.20,000 అద్దె, రూ.10,000 కరెంటు ఛార్జీలు కట్టడం సాంస్కృతిక సంస్థలకు సాధ్యమయ్యేపనేనా? నాటకాలు, నాటికలు, నృత్యాలు అన్నీ ఉచితంగానే జరుగుతాయి కదా? ఇంత పెనుభారం తగ్గించమని ఎందరో కళాకారులు వినపతిపత్రాలు ఇచ్చారు.

అవన్నీ ‘అంధేందూయముల్, మహాబధిర శంఖారావముల్‌’గా మిగిలిపోయాయి.ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సంవత్సరంలో అత్యధిక రోజులు ఆనం కళాకేంద్రం ఖాళీగా ఉంటోంది. అద్దె తగ్గించి, వినిమయాన్ని పెంచగలిగితే, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఒకప్పుడు విమానయానం ఖర్చు నింగిపై ఉండేది. టిక్కెట్‌ ధర తగ్గాక, అన్ని విమానాలు ‘ఫుల్‌’ అవుతున్నాయి?  ఈ ఫార్ములా అవలంబిస్తే, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల కోసం పురమందిరానికి ఆనుకుని ఒక వేదిక ఉంది. ఒకప్పుడు ఈ వేదిక ఒక వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఈ వేదిక ‘వెంటిలేటరు’ మీదకు చేరుకుంది. పది లక్షల స్వల్ప మొత్తంతో ఈ వేదికను అభివృద్ధి చేయవచ్చు. ఈవెంట్‌ మేనేజిమెంట్లకు, పుష్కరాలలో బాణసంచాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. 

రూ.ఆరు వేలతో ఎలా బతకగలరు?
సాక్షి: జిల్లాలో నాట్యకళావికాసానికి నాట్యగురువులను నియమించారు కదా?
బదరీనారాయణ: నియమించారు, సంతోషం. లక్ష్యం ఎక్కడి వరకు నెరవేరుతోంది? జిల్లాలో వారానికి అయిదు రోజులు పర్యటించి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలల్లో నాట్య గురువు నాట్యం బోధించాలి. వారికి ఇచ్చే వేతనం నెలకు రూ. ఆరు వేలు. పర్యటనలకు ప్రభుత్వం టీఏ, డీఏలు ఇవ్వదు. అన్నీ ఆ ఆరు వేలల్లోనే. చేతికి మిగిలేది నెలకు ఏ రెండు వేలో, దీనితో వారు మనుగడ ఎలా సాగించగలరు? వృత్తికి ఏమి న్యాయం చేయగలరు?

నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనులవుతారు..
సాక్షి: చివరిగా మీరిచ్చే సందేశం ఏమిటి?
బదరీనారాయణ: ఆధ్యాత్మిక, కళా సాంస్కృతిక రంగాలను పట్టించుకునే ప్రభుత్వానికే మనుగడ ఉంటుంది. లేకపోతే, పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 

మరిన్ని వార్తలు