పాలేకర్ మాటలపై శాస్త్రవేత్తల ఫైర్

14 Sep, 2016 01:30 IST|Sakshi
పాలేకర్ మాటలపై శాస్త్రవేత్తల ఫైర్

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రకృతి వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మాటలు, వ్యంగ్యాస్త్రాలకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల మనస్సు కష్టపడింది. ఒక్కసారిగా వేదిక ముందున్న కుర్చీల్లోంచి లేచి ప్రాంగణం బయటకు వెళ్లిపోయారు. శిక్షణా తరగతులను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించారు. సైన్స్‌ను అవమానిస్తే సహించబోమంటూ స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో తెలియక పాలేకర్ సైతం కొద్దిసేపట్లోనే ప్రసంగాన్ని విరమించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతుల్లో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

 పరిశోధనలను తప్పుపడుతూ వ్యాఖ్యలు..
 మూడో రోజైన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రకృతి సేద్యం గురించి పాలేకర్ రైతులకు సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సైన్స్‌ను, శాస్త్రవేత్తల పరిశోధనలను తప్పుపడుతూ వ్యాఖ్యానాలు చేశారు. ‘వ్యవసాయ పరంగా మనకు లభ్యమయ్యే విజ్ఞానం నేడు అజ్ఞానంగా మారింది. సైన్స్ వల్ల రైతులకేం ప్రయోజనం? కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయ’ని సుభాష్‌పాలేకర్ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ‘ఎంతకాలం రైతుల ఆత్మహత్యలంటూ’ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అప్పటి వరకూ మౌనంగా ఉన్న వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక్కసారిగా లేచి బయటకు వెళ్లారు.

వ్యవసాయ శాఖ విద్యార్థులు కూడా వీరిని అనుసరించి బయటకు వె ళ్లారు. ప్రకృతి వ్యవసాయాన్ని మేం వ్యతిరేకించడం లేదు.. అలాగని శాస్త్రవిజ్ఞాన రంగాన్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేం. రెండు రోజులుగా భరిస్తున్నాం. ఏంటిది? అధికారులు, శాస్త్రవేత్తలను తిట్టించడానికా ఈ తరగతులంటూ భగ్గుమన్నారు. కొద్దిసేపటి తరువాత విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వి.విజయ్‌కుమార్ శాస్త్రవేత్తల దగ్గరకెళ్లి సర్దిచెప్పారు.

>
మరిన్ని వార్తలు